Bhainsa: భైంసా మున్సిపల్ కమిషనర్ కుర్చీకి శాపం.. వివాదాలు, ఏసీబీ కేసుల పరంపర

Bhainsa: భైంసా మున్సిపాలిటీలో గడిచిన 7 ఏళ్లలో 10 మంది కమిషనర్లు పనిచేయగా, వారిలో ఎక్కువ మంది వివాదాలు, ఏసీబీ కేసులు మరియు సస్పెన్షన్‌లను ఎదుర్కొన్నారు.

Srinivas, Mondol Bhainsa
Published on: 13 Nov 2026 5:07 PM IST
Bhainsa
X

Bhainsa: భైంసా మున్సిపల్ కమిషనర్ కుర్చీకి శాపం.. వివాదాలు, ఏసీబీ కేసుల పరంపర

భైంసా: భైంసా మున్సిపాలిటీలో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వారికి కాలం కలిసి రావడం లేదనే చర్చ సాగుతోంది. గడిచిన ఏడేళ్లలో ఏకంగా పది మంది అధికారులు కమిషనర్లుగా విధులు నిర్వహించగా, వారిలో ఏడుగురు ఏదో ఒక సమస్య, వివాదం లేదా శాఖాపరమైన చర్యలతో వార్తల్లో నిలిచారు. ముగ్గురు మాత్రమే ఎలాంటి వివాదాలు లేకుండా పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు.2019 డిసెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన ఎం.ఏ. ఖదీర్ అనారోగ్యంతో విధుల్లో ఉండగానే మృతి చెందారు.

ఆయన తర్వాత వచ్చిన ఎం.ఏ. ఆలీమ్ ఉద్యోగుల నియామకాల వివాదంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. అనంతరం ఏ. సంపత్ కుమార్ ఎఫ్‌ఏసీ బాధ్యతలు నిర్వహించగా, ఏ. వెంకటేశ్వర్లు రూ.30 వేల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. సీహెచ్ సుదర్శన్ రెడ్డి ఇన్‌చార్జిగా కొంతకాలం బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత వచ్చిన రాజేష్ కుమార్ ఆస్తి మ్యుటేషన్ వివాదంలో పోలీసు కేసును ఎదుర్కొని బదిలీ అయ్యారు.

అనంతరం సబ్ కలెక్టర్ అజ్మేర సంకేత్ కుమార్ అదనపు బాధ్యతలు నిర్వహించగా, వై. నవీన్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికల వివాదం నేపథ్యంలో అర్ధాంతరంగా బదిలీ అయ్యారు. మామిడిపెల్లి లింగయ్యపై నిధుల వ్యవహారం, విధులకు గైర్హాజరు తదితర ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేశారు.

ఆయన స్థానంలో ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జాదవ్ సంతోష్ తాజాగా రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.ఇలా వరుసగా కమిషనర్లు మారడం, పలువురు వివాదాల్లో చిక్కుకోవడం భైంసా మున్సిపాలిటీలో చర్చనీయాంశంగా మారింది.కమిషనర్ కుర్చీలో ఎవరు కూర్చున్నా సమస్యలు మాత్రం వెంటాడుతున్నాయనే అభిప్రాయం పట్టణంలో వ్యక్తమవుతోంది.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa