Boath: అంగరంగ వైభవంగా శబరి మాత అఖండ జ్యోతి ముగింపు వేడుకలు
Boath: బోథ్ మండలం కనుగుట్టలో ఘనంగా శబరి మాత అఖండ జ్యోతి ముగింపు వేడుకలు. హాజరైన మాజీ మంత్రి జోగు రామన్న, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చిన వైనం.
Boath: అంగరంగ వైభవంగా శబరి మాత అఖండ జ్యోతి ముగింపు వేడుకలు
బోథ్: బోథ్ మండలం కనుగుట్ట గ్రామంలో 31 రోజులుగా కొనసాగిన శబరి మాత అఖండ జ్యోతి మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా ముగిసింది. ముగింపు వేడుకలకు భక్తులు భారీగా తరలిరావడంతో గ్రామం భక్తసాగరంగా మారింది. మహిళల సంప్రదాయ కోలాటాలు, భజనలు, దైవనామస్మరణలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ కార్యక్రమం ప్రజల్లో భక్తిభావంతో పాటు ధర్మం, మానవ విలువలు, గ్రామ ఐక్యతను పెంపొందించింది.
ఈ ముగింపు వేడుకలకు మాజీ మంత్రి జోగు రామన్న, రాష్ట్ర అధ్యాపకుల సంఘ ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వారు ప్రార్థించారు. అనంతరం తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ముగింపు అనంతరం అఖండ జ్యోతిని భక్తులు మంగళహారతులు, జై శబరి మాత నినాదాల నడుమ మహారాష్ట్రలోని సాంగ్వి గ్రామానికి సాగనంపారు. గ్రామస్తులు, యువత, భక్తుల సమష్టి సహకారంతోనే ఈ మహోత్సవం విజయవంతమైందని నిర్వాహకుడు మునిగెల రమణ పేర్కొంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.




