Nirmal: మాదకద్రవ్యాల రహితంగా మార్చడమే లక్ష్యం: కలెక్టర్ భవేశ్ మిశ్రా!

Nirmal: గంజాయి, మాదకద్రవ్యాలు, అక్రమ గుట్కా రవాణా మరియు విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 3 Aug 2026 9:40 PM IST
Nirmal
X

Nirmal: మాదకద్రవ్యాల రహితంగా మార్చడమే లక్ష్యం: కలెక్టర్ భవేశ్ మిశ్రా!

నిర్మల్: జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, అక్రమ గుట్కా రవాణా, విక్రయాల నిర్మూలనపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ, అటవీ, విద్య, వ్యవసాయ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల సాగు, నిల్వ, రవాణా, విక్రయం లేదా వినియోగాన్ని ఏ రూపంలోనూ ఉపేక్షించరాదని స్పష్టం చేశారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే అక్రమ గుట్కా తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.

యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా కాపాడటం ప్రతి శాఖ బాధ్యత అని పేర్కొన్న కలెక్టర్, విద్యార్థి దశ నుంచే మాదకద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతలో చైతన్యం తీసుకురావాలని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ నిరంతర చర్యలు చేపడుతోందని తెలిపారు. శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తూ, మాదకద్రవ్యాల విక్రయం, రవాణాలో పాల్గొనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పటిష్ట నిఘాతో పాటు యువత, విద్యార్థుల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్, ఆర్డీఓ దేవీదాస్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story