Nirmal: ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్!
Nirmal: నిర్మల్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
Nirmal: ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్!
నిర్మల్: నిర్మల్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్, మ్యాపింగ్ కాని ఓటర్ల గుర్తింపు, ఓటర్ల వివరాల్లోని వ్యత్యాసాలు, అనామలీస్ పరిశీలనను నిర్దేశిత నిబంధనల మేరకు పూర్తి చేయాలని సూచించారు.
బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లాల వారీగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్ణీత కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల వివరాల పరిశీలనలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. ఓటర్ల వివరాల్లో ఏవైనా వ్యత్యాసాలు, అనామలీస్ గుర్తించినట్లయితే వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు.
ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత తేదీ, సమయంలో హాజరై తమ పౌరసత్వాన్ని నిర్ధారించే సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించేలా వారికి అవసరమైన సమాచారం అందించాలని తెలిపారు.
ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా అందే దరఖాస్తులను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడంతో పాటు, అనర్హులైన పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు, శిక్షణ అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సిబ్బందికి ఎదురయ్యే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ, ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
జిల్లాలో ఎస్‌ఐఆర్ కింద చేపట్టాల్సిన కార్యక్రమాలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి దశకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి అధికారులకు అవసరమైన వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఓటర్ల జాబితాల ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత కీలకమైనందున అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, సంబంధిత అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




