Asifabad: గురుకులంలో కలెక్టర్ హరిత తనిఖీ.. పిల్లలతో మాటలు
Asifabad: ఆసిఫాబాద్ జిల్లా గురుకుల పాఠశాలను కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్య, భోజన వసతులను పరిశీలించి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
Asifabad: గురుకులంలో కలెక్టర్ హరిత తనిఖీ.. పిల్లలతో మాటలు
విద్యతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందుతున్నాయా..? ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో బోధన నాణ్యత ఎలా ఉంది..? అనే అంశాలపై కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల బాలుర పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. తరగతి గదుల నుంచి వంటశాల వరకు ప్రతి అంశాన్ని పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం వనమహోత్సవంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఆసిఫాబాద్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, తరగతి గదుల నిర్వహణ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి బోధన తీరుపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు వారితో నేరుగా సంభాషిస్తూ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
అనంతరం పాఠశాల వంటశాలను పరిశీలించిన కలెక్టర్.. పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, వంటగది పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య రెండూ సమానంగా ముఖ్యమని పేర్కొన్నారు .
తనిఖీల అనంతరం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ హరిత విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యార్థులకు సూచించారు. పచ్చదనం పెంపుదలతో పర్యావరణ సమతుల్యత కాపాడవచ్చని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.




