Mancherial: మంచిర్యాలలో ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు!
Mancherial: కేంద్రంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ కాళోజీని స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు
Mancherial: మంచిర్యాలలో ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు!
Mancherial: తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు కలిసి కార్యక్రమానికి హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా ఉద్యమాలకు కాళోజీ నారాయణరావు ప్రతిధ్వనిగా నిలిచారని అన్నారు. తెలంగాణ వైతాళికుడిగా తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమమే ఊపిరిగా జీవించారని కొనియాడారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు.
విద్యార్థి దశలోనే నిజాం పాలనను ఎదిరించి తెలంగాణలో విద్యా వ్యాప్తికి కృషి చేశారని తెలిపారు. తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఆదర్శంగా నిలిచారని అన్నారు. బహుభాషా కోవిదుడైన కాళోజీ.. కవిగా, రచయితగా తెలుగుతో పాటు వివిధ భాషల్లో మానవ హక్కులు, కుల వివక్ష లేని సమాజం వంటి అంశాలపై రచనలు చేశారని పేర్కొన్నారు.
మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్ రావు దేశ్‌పాండే, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




