Kagaznagar: పేద రోగులకు తప్పని హైదరాబాద్, ఆసిఫాబాద్ ప్రయాణాలు!

Kagaznagar: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరతను నిరసిస్తూ సిపిఎం సర్వే చేపట్టింది.

LALITH KUMAR, SIRPUR
Published on: 25 July 2026 11:49 PM IST
Kagaznagar
X

Kagaznagar: పేద రోగులకు తప్పని హైదరాబాద్, ఆసిఫాబాద్ ప్రయాణాలు!

కగజనగర్: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కాగజ్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై విస్తృత సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బంది, సూపరింటెండెంట్‌తో మాట్లాడి ఆసుపత్రి పరిస్థితులను తెలుసుకున్నారు.

ఈ సర్వేలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, జిల్లా కార్యదర్శి కుషణ్ రాజన్న, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ముంజం శ్రీనివాస్, ఆనంద్ కుమార్, రాజేందర్, పీ. రాజేష్, మిట్టపెల్లి సుదర్శన్, గోమాస సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ, కాగజ్‌నగర్ ఆసుపత్రిని 2002లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా, అనంతరం 2004లో 30 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, దానికి అనుగుణంగా వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలు పెంచలేదని అన్నారు.

ఆసుపత్రిలో ఉండాల్సిన 20 మంది వైద్యుల స్థానంలో కేవలం నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. స్పెషలిస్ట్ వైద్యులు లేకపోవడంతో ఆపరేషన్ థియేటర్ పనిచేయడం లేదు. ఫలితంగా శస్త్రచికిత్సలు నిలిచిపోయి, సాధారణ వైద్య సేవలకు మాత్రమే పరిమితమవుతోంది.అలాగే స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సాంకేతిక సిబ్బంది తీవ్ర కొరత ఉందన్నారు. రోగులకు సరిపడా మంచినీటి సౌకర్యం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు కూడా అందుబాటులో లేవని గుర్తించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొంతమంది సిబ్బందిని నియమించినప్పటికీ, అది సరిపడడం లేదన్నారు. రెండేళ్ల క్రితం ఏరియా ఆసుపత్రిగా ప్రకటించినా, ఇప్పటికీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థాయిలోనే సేవలు కొనసాగుతున్నాయని విమర్శించారు. కొత్త భవనాల నిర్మాణం కూడా చాలా కాలంగా పెండింగ్‌లో ఉందన్నారు.రోజూ పెద్ద సంఖ్యలో ఇన్‌పేషెంట్లు, ఔట్‌పేషెంట్లు వస్తున్నప్పటికీ, వైద్య సిబ్బంది కొరత కారణంగా అత్యవసర చికిత్స అవసరమైన రోగులను జిల్లా కేంద్రం లేదా హైదరాబాద్‌కు తరలించాల్సి వస్తోందని, దీనివల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్న కుమురం భీమ్ జిల్లాలోని ఏకైక ఏరియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిపై కూడా అధిక పనిభారం పడుతోందన్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story