Echoda: సిరిచెల్మలో పోలీసుల కార్డాన్ సెర్చ్.. 166 వాహనాలు స్వాధీనం

Echoda: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పోలీసులు భారీ కార్డాన్ సెర్చ్ నిర్వహించారు.

NAGULA SATISH, BOATH
Published on: 16 July 2026 10:45 AM IST
Echoda
X

Echoda: సిరిచెల్మలో పోలీసుల కార్డాన్ సెర్చ్.. 166 వాహనాలు స్వాధీనం

​Echoda: ప్రజల రక్షణ, భద్రతే ధ్యేయంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో పోలీసులు భారీ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు 120 మంది పోలీస్ సిబ్బందితో చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీల్లో సరైన పత్రాలు లేని 156 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 8 కార్లు మరియు బొలెరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నెంబర్ ప్లేట్లు లేని మూడు వాహనాలపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.

​ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా కల్తీ కళ్ళు తయారు చేయడానికి నిల్వ ఉంచిన ఒక క్వింటాల్ అమ్మోనియం బైకార్బొనేట్ (గుల్ఫారం) ముడిసరుకును పట్టుకొని నిందితుడు సురేందర్ గౌడ్ పై, అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా 200 బాటిళ్ల అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్న పి. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

​ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, ప్రజలు అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. గంజాయి, మాదకద్రవ్యాల జోలికి వెళ్ళవద్దని, దొంగతనాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే నేర చరిత్ర కలిగిన వారిపై సస్పెక్ట్, రౌడీ షీట్లు ఓపెన్ చేసినట్లు తెలిపారు.

గ్రామాల్లో అసాంఘిక పనులపై సమాచారం ఉంటే 8712659973 నెంబర్‌కు వాట్సప్ ద్వారా తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని కోరారు. తల్లిదండ్రులు పిల్లలను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి చదువుపై దృష్టి పెట్టేలా చూడాలని, వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు.

​ఈ తనిఖీ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పి రుత్వీక్ సాయి కొట్టే, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ఎన్. వెంకట నరసయ్య, ఏఆర్ డిఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సిఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story