Nirmal: భైంసాలో బజ్జీ వ్యాపారుల బుజ్జి కథ.. వ్యాపారంలో స్నేహం, కుటుంబానికి సమయం!
Nirmal: నిర్మల్ జిల్లా భైంసాలో ఎదురెదురుగా ఉండే ఇద్దరు బజ్జీ వ్యాపారులు పోటీ పడకుండా రోజు విడిచి రోజు దుకాణాలు నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Nirmal: భైంసాలో బజ్జీ వ్యాపారుల బుజ్జి కథ.. వ్యాపారంలో స్నేహం, కుటుంబానికి సమయం!
నిర్మల్ జిల్లా: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాపారమే లోకంగా బతుకుతున్న వారికి భైంసాలోని ఇద్దరు బజ్జీ వ్యాపారులు ఓ మంచి సందేశాన్ని ఇస్తున్నారు. సంపాదన ఎంత ముఖ్యమో..! కుటుంబంతో గడిపే సమయం, మనిషికి అవసరమైన విశ్రాంతి కూడా అంతే ముఖ్యమని తమ ఆచరణతో నిరూపిస్తున్నారు. పట్టణంలోని స్థానిక స్టేషన్ సమీపంలోని మార్కెట్‌లో ఎదురెదురుగా బజ్జీ దుకాణాలు నిర్వహించే మహమ్మద్ అబ్దుల్ సమీ, వహీద్ అలీ (పాషా)మంచి స్నేహితులు.
వీరి దుకాణాలకు వచ్చే వినియోగదారులు కూడా ఇద్దరికీ పరిచయస్తులే. దీంతో ప్రతిరోజూ ఇద్దరూ దుకాణాలు తెరిచి ఉంచడం కంటే, ఒకరోజు ఒకరు.. మరుసటి రోజు మరొకరు దుకాణం నిర్వహించేలా పరస్పర అవగాహనతో నిర్ణయించుకున్నారు. దీనివల్ల వ్యాపారానికి ఆటంకం లేకుండా, కుటుంబానికి సమయం కేటాయించే వెసులుబాటు కలిగింది.
అయితే ఇటీవల మహమ్మద్ అబ్దుల్ సమీ మరణించినప్పటికీ, ఆయన పాటించిన మంచి ఆలోచనకు వారసులు మహమ్మద్ అర్షల్లన్, మహమ్మద్ అద్నాన్‌తో పాటు వహీద్ అలీ (పాషా) తనయుడు ఇబ్రహీం అలీ సైతం అదే పద్ధతిని పాటిస్తూ దుకాణాలను రోజువారీగా మార్చి మార్చి నిర్వహిస్తున్నారు.తండ్రులు చూపిన దారిలోనే నడుస్తూ వ్యాపారంలో పోటీ కంటే పరస్పర సహకారమే ముఖ్యమని ఈ యువ వ్యాపారులు చాటుతున్నారు.
ఒకరి వ్యాపారానికి మరొకరు అండగా ఉంటూ, కుటుంబానికి సమయం కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు. వీరి వినూత్న ఆలోచనను చూసి స్థానికులు సైతం అభినందిస్తున్నారు.సంపాదన కోసం జీవితాన్ని కోల్పోకుండా,జీవితంలోసంపాదనతో పాటు ఆనందానికీ చోటు కల్పించాలనే ఈ బజ్జీ వ్యాపారుల ఆలోచన నేటి తరానికి నిజంగా ఆదర్శం..!




