Adilabad: ఆదిలాబాద్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు!

Adilabad: ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 19 Oct 2026 7:17 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు!

Adilabad: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు.

కలెక్టర్‌తో పాటు ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని బతుకమ్మను ఆడుతూ మహిళలు, యువతులతో కలిసి సంబురాల్లో భాగస్వాములయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ పాటలతో స్టేడియం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల సాంస్కృతిక జీవనానికి, ప్రకృతితో మమేకమైన మన సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

రానున్న రోజుల్లో నీటి కొరత వంటి సమస్యలు ఎదురుకాకుండా ఇప్పటి నుంచే నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చుక్క నీటిని కూడా వృథా చేయకుండా, ప్రకృతి వనరులను పరిరక్షిస్తూ, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ప్రజలను కోరారు.బతుకమ్మ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన పలువురు మండలాల మహిళా సమైక్య సభ్యులకు జిల్లా కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులు, మహిళలు, యువతులు, జిల్లా ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంట ఆనందాన్ని, సౌభాగ్యాన్ని నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రూ, ఎస్. రాజేశ్వర్, డీఆర్‌డీఓ రవీందర్ రాథోడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, జిల్లా సంక్షేమ, ఎస్సీ సంక్షేమ అధికారులు మిల్కా, సునీత కుమారి, మహిళా సమైక్య ప్రతినిధులు, బాలికలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.