Gudihatnoor: సమస్యలు తీర్చకపోతే జాతీయ రహదారి దిగ్బంధం ప్రజల హెచ్చరిక!

Gudihatnoor: ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌కు రానివ్వకపోవడంపై సర్పంచ్ ఆడే శీల అధ్యక్షతన గ్రామసభ జరిపారు. సమస్య పరిష్కరించకపోతే నేషనల్ హైవే దిగ్బంధిస్తామని హెచ్చరించారు.

NAGULA SATISH, BOATH
Published on: 11 Aug 2026 2:03 PM IST
Gudihatnoor
X

Gudihatnoor: సమస్యలు తీర్చకపోతే జాతీయ రహదారి దిగ్బంధం ప్రజల హెచ్చరిక!

Gudihatnoor: గుడిహత్నూర్ మండల కేంద్రంలో నేషనల్ హైవే పనుల సాకుతో ఆర్టీసీ బస్సులను బస్టాండ్‌కు రానివ్వకుండా జవాహర్ నగర్ ఎక్స్ రోడ్డు (అండర్ బ్రిడ్జ్) మీదుగా మళ్లించడం వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న నరకయాతనపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోజుకు వందలాది బస్సులతో కళకళలాడే గుడిహత్నూర్ బస్టాండ్ వెలవెలబోతుండటం, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో మంగళవారం రైతువేదికలో సర్పంచ్ శ్రీమతి ఆడే శీల అధ్యక్షతన పార్టీలకతీతంగా ప్రత్యేక అత్యవసర గ్రామసభ నిర్వహించారు.

​ఈ సందర్భంగా గ్రామసభలో పలు కీలక సమస్యలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. గుడిహత్నూర్ నుండి ఆసిఫాబాద్, ఉట్నూర్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్ వెళ్లే ఆర్టీసీ బస్సులు గుడిహత్నూర్ మెయిన్ బస్ స్టాప్‌కు రాకుండా దారిమళ్లించి వెళ్లడం వల్ల స్థానికులు, వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పాత పద్ధతిలోనే అన్ని బస్సులను బస్టాండ్‌కు మళ్లించాలని డిమాండ్ చేశారు.

​ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోనే బస్సుల రద్దీ పరంగా రెండవ అతిపెద్ద కేంద్రంగా ఉన్న గుడిహత్నూర్ బస్టాండ్ సరిగ్గా నడవకపోతే, దాన్ని నమ్ముకుని ఉన్న దాదాపు 30కి పైగా చిరువ్యాపారాల షాపులు పూర్తిగా మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

బస్టాండ్ చుట్టూ ఉన్న చిన్న చిన్న హోటళ్లు, మక్క కంకులు అమ్ముకునేవారు, ఇతర వ్యాపారులు మరియు ఆటో కార్మికులు తమ జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు.

​అలాగే ఆదిలాబాద్, నిర్మల్ వెళ్లే బస్సులు ఆగే స్థలంలో కనీసం షెల్టర్ లేకపోవడం, బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న డివైడర్ వల్ల బస్సులు లోపలికి రావడానికి ఆటంకం కలగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్ నగర్ సర్వీస్ రోడ్డు గుండా బస్సులను నడిపితే తొమ్మిది గ్రామాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు.

​దీనికితోడు, అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను తీవ్ర జాప్యంతో నత్తనడకన నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ సాదుద్దీన్ (అక్బర్ ఇన్ఫ్రా) వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, సదరు కాంట్రాక్టర్‌ను తక్షణమే మార్చాలని తీర్మానించారు.

రోడ్డు మరమ్మత్తులు సరిగ్గా లేకపోవడంతో సర్వీస్ రోడ్డు గుండా వాహనాలు వెళ్లేటప్పుడు రాళ్లు ఎగిరి ఫడ్ ప్రహ్లాద్ నివాసంతో పాటు పరిసర ఇళ్లపై పడుతున్నాయని, ఈ ప్రమాదకర రోడ్డును వెంటనే బాగు చేయాలని కోరారు.

​ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ, ఆర్టీసీ అధికారుల బాధ్యతారాహిత్యం మరియు రవాణా కష్టాలపై 24 గంటల్లోగా స్పందించి సమస్యను పరిష్కరించకపోతే, రేపు గ్రామస్తులందరినీ ఏకం చేసి జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని స్పష్టమైన హెచ్చరిక చేశారు.

​ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సంజీవ్ ముండే, ఉప సర్పంచ్ నిఖిల్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు శ్రీరామ్, మాధవ్ పటేల్, శంభాజీ చాటే, వామన్ పటేల్, ప్రహ్లాద్, వివిధ పార్టీల నాయకులు, ససనే మాధవ్, అర్షద్, శ్రీకర్, వసీం ఖాన్, మరియు స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేరకు తీర్మానం ప్రతులను జిల్లా కలెక్టర్, ఆర్టీసీ డీఎం, జిల్లా ఎస్పీ, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ, తహసిల్దార్ మరియు స్థానిక ఎస్‌ఐకి అందజేస్తామన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story