Gudihatnur: ఎంపికైనా అందని అంగన్‌వాడీ నియామక ఉత్తర్వులు!
Gudihatnur: అంగన్‌వాడీ పోస్టులకు ఎంపికై పుష్కర కాలం గడుస్తున్నా నియామక ఉత్తర్వులు రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Gudihatnur: ఎంపికైనా అందని అంగన్‌వాడీ నియామక ఉత్తర్వులు!
Gudihatnur: అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ఎంపికై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు నియామక ఉత్తర్వులు అందకపోవడంతో తమకు న్యాయం చేయాలని గుడిహత్నూర్ మండలానికి చెందిన కనక పుష్పలత, ఆత్రం లింగుబాయి ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో 2012 అక్టోబర్‌లో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన కనక పుష్పలత, రాగాపూర్ పంచాయతీ బొర్రమద్ది గ్రామానికి చెందిన ఆత్రం లింగుబాయి దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం 2013 మార్చిలో గుడిహత్నూర్ 6వ అంగన్‌వాడీ కేంద్రానికి టీచర్‌గా కనక పుష్పలత, బొర్రమద్ది కేంద్రానికి ఆయాగా ఆత్రం లింగుబాయి ఎంపికయ్యారు.
అయితే ఎంపిక జరిగి పుష్కర కాలం కావస్తున్నా నేటికీ తమకు నియామక పత్రాలు అందజేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నియామక ఉత్తర్వులు జారీ చేయకపోవడానికి గల కారణాలను తెలపాలని కోరుతూ 2018లో హైకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉందని తెలిపారు.
ఇదిలా ఉండగా, తాను ఎంపికై న్యాయస్థానంలో కేసు నడుస్తున్న గుడిహత్నూర్ 6వ అంగన్‌వాడీ కేంద్రానికి ఈ నెల 16న అధికారులు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయడంపై పుష్పలత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న పోస్టుకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వాపోయారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని 2013 నాటి ఎంపిక రికార్డులను పరిశీలించాలని, పెండింగ్‌లో ఉన్న కేసును పరిగణనలోకి తీసుకుని నిబంధనల ప్రకారం తమకు నియామక ఉత్తర్వులు అందజేసి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.




