Gudihatnur: చేరికలకు గంట ముందే బీజేపీ మండలాధ్యక్షుడి సస్పెన్షన్!

Gudihatnur: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు.

NAGULA SATISH, BOATH
Published on: 2 Aug 2026 1:26 PM IST
Gudihatnur
X

Gudihatnur: చేరికలకు గంట ముందే బీజేపీ మండలాధ్యక్షుడి సస్పెన్షన్!

Gudihatnur: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికర మలుపు తిరిగింది. ఒకే రోజు చోటుచేసుకున్న పరిణామాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. స్వయంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ సొంత మండలంలోనే ఈ పరిణామాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మండలంలో పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నారనే వార్తల నడుమే, చేరికల కార్యక్రమానికి కేవలం ఒక గంట ముందే బీజేపీ జిల్లా నాయకత్వం ప్రెస్ నోట్ ద్వారా సస్పెన్షన్ లేఖను విడుదల చేయడం ఇరు పార్టీల మధ్య ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ఆదివారం గుడిహత్నూర్ రాజకీయంలో నాటకీయ మార్పులు వేగంగా జరిగాయి. మండల బీజేపీ అధ్యక్షుడు కేంద్రే శివాజీ, మాజీ అధ్యక్షుడు జాడి సుభాష్‌లతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రాంతీయ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాము స్వచ్ఛందంగా బీఆర్ఎస్‌లో చేరినట్లు ఆ నేతలు తెలిపారు.

​అయితే, సదరు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సరిగ్గా ఒక గంట ముందే బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ సంతకంతో ఉన్న ఒక అధికారిక సస్పెన్షన్ ఉత్తర్వు ప్రెస్ నోట్ రూపంలో వెలువడింది. తమ సొంత మండలంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, క్రమశిక్షణా రాహిత్యానికి ఒడిగట్టినందుకే కేంద్రే శివాజీని ప్రాథమిక సభ్యత్వం నుండి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఆ లేఖలో పేర్కొన్నారు.

​ఈ వ్యవహారంపై రెండు పార్టీల నేతలు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. నేతలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిసే, చేరికలకు ఒక్క గంట ముందే హడావుడిగా ప్రెస్ నోట్ విడుదల చేసి సస్పెన్షన్ నాటకంతో రక్షణ పొందే ప్రయత్నం బీజేపీ చేసిందని బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు మరియు చేరికలకు సిద్ధమవుతున్నారనే సమాచారంతోనే తక్షణ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ముందస్తుగా సస్పెండ్ చేశామని, పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ఏమాత్రం సహించేది లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

​చేరికల ముందు గంట వ్యవధిలోనే సస్పెన్షన్ ఆర్డర్ రావడం, ఆ వెంటనే సదరు నాయకులు బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం గుడిహత్నూర్ మండలంలో తీవ్ర రాజకీయ కాక పుట్టిస్తోంది.

కాగా స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉండగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడి సొంత మండలంలోనే జరిగిన ఈ పరిణామంతో బీజేపీ స్థానికంగా పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించింది.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story