Adilabad: ఆదిలాబాద్లో గునుగు పూల సేకరణ.. కూలీలకు ఉపాధి మార్గం!
Adilabad: బతుకమ్మ వేడుకల వేళ ఆదిలాబాద్ జిల్లాలో గునుగు పూలకు భారీ డిమాండ్ ఏర్పడింది. వివిధ జిల్లాల నుంచి బోథ్, ఇచ్చోడ ప్రాంతాలకు వచ్చే కూలీలకు పూల సేకరణ ఉపాధి మార్గంగా మారుతోంది.
Adilabad: ఆదిలాబాద్లో గునుగు పూల సేకరణ.. కూలీలకు ఉపాధి మార్గం!
Adilabad: తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు ప్రకృతి ఒడిలో లభించే రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. ఆదిలాబాద్ జిల్లాలో గునుగ పూల సందడి మొదలవుతుంది. ఈ పూల సేకరణే ఇతర జిల్లాల నుంచి వచ్చే కూలీలకు ఉపాధి మార్గంగా మారుతోంది.
బతుకమ్మ పండుగకు గునుగ పూలకు ఉండే ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఈ పూల కోసం పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు ఆదిలాబాద్ జిల్లాకు తరలివస్తున్నారు. వాహనాల్లో గ్రామీణ ప్రాంతాలకు చేరుకుని పొలాలు, పరిసర ప్రాంతాల్లో విస్తారంగా లభించే గునుగ పూలను సేకరిస్తున్నారు. అనంతరం వాటిని కట్టలుగా కట్టి తమ ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు,
ముఖ్యంగా గుడిహత్నూర్, ఇచ్చోడ, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో గునుగ పూలు ఎక్కువగా లభిస్తుండటంతో కూలీలకు ఈ ప్రాంతాలు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. తమ జిల్లాల్లో గునుగ పూలు ఆశించిన స్థాయిలో లభించకపోవడంతోనే ఆదిలాబాద్కు వస్తున్నామని కూలీలు చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్లుగా ప్రతి బతుకమ్మ పండుగ సమయంలోనూ ఇక్కడికి వచ్చి గునుగ పూలను సేకరిస్తున్నామని, ఈ తొమ్మిది రోజుల పండుగ తమకు కొంత ఆదాయాన్ని అందిస్తోందని పేర్కొంటున్నారు.
ఒకవైపు తెలంగాణ ఆడపడుచులు గునుగ పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పండుగను జరుపుకుంటుంటే.. మరోవైపు అదే గునుగ పూలు ఇతర జిల్లాల నుంచి వచ్చే కూలీలకు జీవనోపాధిని కల్పిస్తున్నాయి. ప్రకృతిలో సహజంగా లభించే ఈ పూలు పండుగ సంబరాలకే పరిమితం కాకుండా, వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే కూలీలకు ఆదాయ వనరుగా నిలుస్తుండటం విశేషం.
మొత్తానికి బతుకమ్మ పండుగ వేళ ఆదిలాబాద్ జిల్లాలో గునుగ పూలకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. పూల సేకరణతో ఇతర జిల్లాల కూలీలకు ఉపాధి లభిస్తుండగా.. తెలంగాణ సంస్కృతిలో ప్రకృతికి ఉన్న ప్రాధాన్యత మరోసారి చాటిచెబుతోంది.




