Adilabad: 'నేనున్నానంటూ' బండరాయిని పట్టి ఉంచిన వృక్షరాజం
Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ సమీపంలో ఏ క్షణమైనా కిందపడేలా ఉన్న భారీ కొండ చరియను తన వేర్లతో పట్టి ఉంచిన వృక్షరాజం.
Adilabad: 'నేనున్నానంటూ' బండరాయిని పట్టి ఉంచిన వృక్షరాజం
Adilabad: నేటి యాంత్రిక జీవనంలో మనుషుల మధ్య ఆప్యాయతలు, అనురాగాలు రోజురోజుకూ కరువవుతున్నాయి. రక్తం పంచుకు పుట్టిన వాళ్లే కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో.. కఠినమైన రాతి గుండెల్లోనూ తడి పుట్టించే ఒక అద్భుత దృశ్యం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం చింతగూడ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆవిష్కృతమైంది.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇక్కడ ఎప్పుడు ఏ కొండ చరియ విరిగి నెత్తిన పడుతుందోనని వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం పొంచి ఉన్న ఈ ప్రాంతంలో.. కనీసం ఒక్క ప్రమాద సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయని జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, అధికారులు పట్టించుకోకపోయినా.. ఒంటరిగా మిగిలిన ఆ కొండకు మాత్రం ప్రకృతి తానే స్వయంగా రక్షకురాలిగా నిలిచింది. నిలువునా చీలిపోయి, ఏ క్షణమైనా కిందపడి ముక్కలవడానికి సిద్ధంగా ఉన్న ఆ భారీ కొండ చరియను.. పైన ఉన్న వృక్షం తన వేర్లనే చేతులతో గట్టిగా చుట్టేసింది. స్వార్థంతో నిండిపోయిన నేటి సమాజానికి కనువిప్పు కలిగిస్తూ.. ‘నీకు నేనున్నానని’ ఆ బండరాయిని అక్కున చేర్చుకుంది.
రాతికి, వృక్షానికి మధ్య ఉన్న ఈ మూగ బంధం, మనుషుల మధ్య అంతరించిపోతున్న ప్రేమానురాగాలను, బాధ్యతలను గుర్తుచేస్తోంది. చావు అంచున నిలబడ్డ కొండకు ఆ చెట్టు ప్రాణభిక్ష పెడుతున్న ఈ దృశ్యం, ఇప్పుడు ప్రతి వాహనదారుడిని ఆలోచింపజేస్తూ, మనసును హత్తుకుంటోంది.




