Ichoda: పంట వ్యర్థాలను తగులబెట్టొద్దు.. భూమిలోనే కలియదున్నండి: రైతు రామేశ్వర్ గైక్వాడ్ పిలుపు!

Ichoda: పంట వ్యర్థాలను తగులబెడితే భూసారం దెబ్బతింటుందని ఇచ్చోడ మండలం నవేగాం గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు రామేశ్వర్ గైక్వాడ్ రైతులకు కీలక సూచనలు చేశారు.

NAGULA SATISH, BOATH
Published on: 30 May 2026 8:58 PM IST
Ichoda
X

Ichoda: పంట వ్యర్థాలను తగులబెట్టొద్దు.. భూమిలోనే కలియదున్నండి: రైతు రామేశ్వర్ గైక్వాడ్ పిలుపు!

ఇచ్చోడ: ఇచ్చోడ మండలంలోని నవేగాం గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు రామేశ్వర్ గైక్వాడ్ రైతులకు ఒక కీలకమైన సందేశాన్ని అందించారు. పంట వ్యర్థాలను పొలాల్లోనే తగులబెట్టకుండా, వాటిని భూమిలోనే కలియదున్నడం ద్వారా పర్యావరణాన్ని, ప్రకృతిని మరియు మన భూమిని కాపాడుకోవచ్చని అన్నారు.

​ఇటీవలి కాలంలో బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల్లో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఈ ఎండల వేడికి, ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదాల వల్ల వందలాది ఎకరాల్లో జొన్న పంట కాలి బూడిదైంది. చేతికొచ్చిన పంట కళ్లముందే బూడిదవ్వడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి కోలుకోలేని స్థితిలో ఉన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, మిగిలిన పంట వ్యర్థాలను రైతులు స్వచ్ఛందంగా తగులబెట్టడం సరైన పద్ధతి కాదని రామేశ్వర్ గైక్వాడ్ గుర్తుచేశారు.

​పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల భూమిలోని మిత్రపురుగులు, సూక్ష్మజీవులు నశించి నేల చవుడుబారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అదే వ్యర్థాలను ట్రాక్టర్లతో భూమిలోనే కలియదున్నడం వల్ల, అవి కొద్ది రోజుల్లోనే కుళ్లిపోయి భూమికి సహజసిద్ధమైన సేంద్రియ ఎరువుగా (హ్యూమస్) మారతాయి. దీనివల్ల నేల లూజుగా మారి, తదుపరి పంటల సాగుకు అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే భూమిలో తేమను పట్టి ఉంచే శక్తి కూడా పెరుగుతుంది.

​కాబట్టి, రైతులందరూ తక్షణ లాభం లేదా శ్రమను తగ్గించుకోవడం కోసం పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని ఆయన కోరారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, భూసారాన్ని పెంచుకోవడానికి పంట వ్యర్థాలను భూమిలోనే కలియదున్నాలని, తద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. నేలను నమ్ముకున్న రైతు, నేలకు నష్టం చేయకుండా ప్రకృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story