Adilabad: ఆదిలాబాద్‌లో ‘ఆరోగ్య పాఠశాల’ ప్రారంభం.. పాక్సో క్యాలెండర్ విడుదల
Adilabad: బజార్‌హత్నూర్‌లో ఆరోగ్య పాఠశాల మూడో విడతను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్. విద్యార్థుల రక్షణకై ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు.
Adilabad: ఆదిలాబాద్‌లో ‘ఆరోగ్య పాఠశాల’ ప్రారంభం.. పాక్సో క్యాలెండర్ విడుదల
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రత, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు.
జిల్లాలోని బజార్హత్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల లో నిర్వహించిన మూడవ విడత ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి బోథ్ శాసన సభ్యులు అనిల్ జాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు ఆరోగ్య పాఠశాల లోని అంశాలపై పాటలు, నృత్యం, నాటిక రూపంలో అవగాహన కల్పించారు. సంబంధిత అధికారులు ఆరోగ్య పాఠశాల లోని ఆరు అంశాలపైన వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, మానసిక ఆరోగ్యం, మాదకద్రవ్యాల నివారణ, కాలానుగుణ వ్యాధుల నివారణ, వ్యక్తిత్వ వికాసం పై వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రత, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. గత రెండేళ్లుగా జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని, దీనికిగాను గతంలో జిల్లాకు అవార్డు లభించిందని గుర్తుచేశారు.
ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల రక్షణకై ‘పాక్సో చట్టం’పై ప్రత్యేక అవగాహన కల్పించడంతో పాటు, ‘పాక్సో క్యాలెండర్’ ను విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థులు తమకు ఎదురయ్యే రకరకాల సమస్యలను నిర్భయంగా, గోప్యంగా చెప్పుకునేందుకు పాఠశాలల్లో ‘ఫిర్యాదుల పెట్టెలను’ ఏర్పాటు చేస్తున్నామని, వీటిని ప్రతి నెల ఒకటో తేదీన ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో తెరిచి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామన్నారు.




