Adilabad: కాంగ్రెస్‌లో వర్గపోరు డీసీసీ అధ్యక్షుడిపై తిరుగుబాటు బావుటా!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన బోథ్ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్.

NAGULA SATISH, BOATH
Published on: 29 Aug 2026 11:10 AM IST
Adilabad
X

Adilabad: కాంగ్రెస్‌లో వర్గపోరు డీసీసీ అధ్యక్షుడిపై తిరుగుబాటు బావుటా!

Adilabad: ​ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నరేష్ జాదవ్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు, విలువ ఇవ్వడం లేదని, నరేష్ జాదవ్ ప్రతి విషయంలోనూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ నేతలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన అధిష్ఠానం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.

​ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆడే గజేందర్ తన అనుచరులు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను నేరుగా కలిసి జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ పీఏసీ కమిటీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై గజేందర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ల ఎంపిక ప్రక్రియలో బోథ్ నియోజకవర్గానికి చెందిన ఆశావహుల పేర్లను పక్కనబెట్టి, డీసీసీ అధ్యక్షుడు తన ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

​జిల్లా అధ్యక్షుడి వ్యవహారశైలి వల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయని, క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆడే గజేందర్ అనుచరులు ఆరోపిస్తున్నారు. పార్టీ ప్రతిష్టను కాపాడటంతో పాటు సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే తక్షణమే జిల్లా అధ్యక్షుడిని మార్చాలని, పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే నేతకు జిల్లా పగ్గాలు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బోథ్ నియోజకవర్గ నేతల ఈ పర్యటన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story