Asifabad: ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు!
Asifabad: ఎస్‌ఐఆర్ ఫేజ్-2 ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.
Asifabad: ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు!
Asifabad: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఫేజ్-2 ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పట్టణంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ ఫేజ్-2 సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొని పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, సూపర్‌వైజర్లకు దిశానిర్దేశం చేశారు. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో 84,990 అనమాలీస్, 48,139 ఓట్లు తొలగించే జాబితాలో ఉన్నాయని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ఓటర్ల పేర్లు కూడా అనమాలీస్ జాబితాలో ఉండే అవకాశం ఉందని, ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు.
నోటీసులు వచ్చే వరకు వేచి చూడకుండా, అవసరమైన ఆధార పత్రాలతో ఫారం-7 సమర్పించాలని సూచించారు. పట్టణం, డివిజన్, మండలం, గ్రామం, బూత్ స్థాయిలో నిరంతరం సమీక్షలు నిర్వహించి ఓటర్ల జాబితాను పరిశీలించాలని ఆదేశించారు.
భారీగా ఓట్లు తొలగించే ప్రయత్నాలు: జూపల్లి
అనంతరం మీడియాతో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలోనూ భారీ సంఖ్యలో ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కోల్పోకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందని తెలిపారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులతో పాటు రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి శ్యాంనాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




