Kagaznagar: పోలీస్ అధికారిపై అవినీతి ఆరోపణలు.. ఆడియోలు లీక్!

Kagaznagar: డివిజన్‌లో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులతో పోలీస్ అధికారి హస్తకళసింపు. కిందిస్థాయి వ్యక్తి ద్వారా వసూళ్లు, ఆడియోలు, స్క్రీన్‌షాట్లు లీక్ అయి సంచలనం.

SRINIVAS, KOUTALA
Published on: 12 Sept 2026 11:29 AM IST
Kagaznagar
X

Kagaznagar: పోలీస్ అధికారిపై అవినీతి ఆరోపణలు.. ఆడియోలు లీక్!

Kagaznagar: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ లో ఓ పోలీస్ అధికారిపై అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంతో సదరు అధికారి పాత్ర ఉందంటూ ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

తాజాగా తనపై చర్యలు తప్ప వనే ప్రచారం నేపథ్యంలో పరిధిలోని అక్రమ వ్యాపారుల నుంచి కిందిస్థాయి వ్యక్తుల ద్వారా వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

అక్రమంగా సరుకు తరలించే వ్యాపారుల వద్దకు కిందిస్థాయి వ్యక్తి ద్వారా సార్ వెళ్తున్నారు ఇక ఉండరు అంటూ డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని లావాదేవీలు సదరు వ్యక్తి ఫోన్ కు నేరుగా చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇందుకు సంబంధించినవిగా చెబుతున్న ఆడియో రికార్డులు డబ్బులు పంపిన స్క్రీన్ షాట్ లు బయటకు రావడంతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది. సదరు అధికారిపై బియ్యం రేషన్ అక్రమ రవాణాకు సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం.

పట్టు కున్న సరుకు, వాహనాలను విడుదల చేసిన అనంతరం మధ్యవర్తుల ద్వారా సరుకును విక్రయించి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందించినట్లు తెలుస్తోంది.

విచారణకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్త మవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు సైతం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

తనపై చర్యలు లేదా బదిలీ తప్పదనే ప్రచారం నేపథ్యంలో సదరు అధికారి ముందుగానే సర్దుకునే పనిలో పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిందిస్థాయి వ్యక్తి ద్వారా వసూళ్లు సాగినట్లు చెబుతున్న ఆధారాలు బయటకు రావడంతో పోలీస్శాఖలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ఇంతటి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చడంతో పాటు ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతు న్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA