Neredigonda: కుప్టి ఘాట్‌లో లారీల ఢీ రోడ్డుపైకి ఎమ్మెల్యే అనిల్!
Neredigonda: కుప్టి ఘాట్ రోడ్డులో లారీలు ఢీకొని ట్రాఫిక్ స్తంభించడంతో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Neredigonda: కుప్టి ఘాట్‌లో లారీల ఢీ రోడ్డుపైకి ఎమ్మెల్యే అనిల్!
Neredigonda: నెరడిగొండ పరిధిలోని కుప్టి ఘాట్ రోడ్డుపై ఈరోజు ఉదయం టమాటా, సిమెంట్ లారీలు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో జాతీయ రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. ప్రమాద తీవ్రతకు రహదారిపై రాకపోకలు నిలిచిపోయి, ఒక సైడు బ్రిడ్జికి గుంత పడటంతో అధికారులు అటువైపు రోడ్డు మూసివేసి వన్ వే లో వాహనాలను మళ్లిస్తున్నారు, దీంతో అటువైపు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు గంటల తరబడి చిక్కుకుపోయారు. అత్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దిగాల్సిన హైవే యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఘాట్ పరిసరాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఈ ట్రాఫిక్ దిగ్బంధం గురించి తెలియగానే బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేవలం ఆదేశాలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, స్వయంగా రోడ్డుపై నిలబడి కుప్టి బ్రిడ్జి మీదుగా వాహనాలను ఒక్కొక్కటిగా కదిలిస్తూ రాకపోకలను చక్కదిద్దారు. హైవే అధికారుల అలసత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన, సమస్య తీవ్రతను గుర్తించి వెంటనే జేసీబీ యంత్రాన్ని రప్పించారు.
కుప్టి బస్టాండ్ సమీపంలో ప్రత్యామ్నాయంగా తాత్కాలిక దారిని ఏర్పాటు చేయించి, భారీ వాహనాలను మళ్లించే ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు.
సమస్య పరిష్కారమయ్యే వరకు అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ప్రజల ఇబ్బందులే తన మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన హైవే విభాగం తీరును హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, కుప్టి బ్రిడ్జి రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించే దాకా పోరాటం ఆపేది లేదని తేల్చిచెప్పారు. ప్రజాప్రతినిధి స్వయంగా ట్రాఫిక్ పోలీసులా మారి రహదారిని క్లియర్ చేయించడం, ప్రయాణికుల కష్టాలను తీర్చడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.




