Mancherial: మంచిర్యాల జిల్లాలో ఎరువుల దుకాణాల దందా అధిక ధరలకు విక్రయం!
Mancherial: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో ఎరువుల వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు యూరియా, డీఏపీ విక్రయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారు.
Mancherial: మంచిర్యాల జిల్లాలో ఎరువుల దుకాణాల దందా అధిక ధరలకు విక్రయం!
Mancherial: బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్ మండలంలో ఎరువుల వ్యాపారుల దందా మితిమీరిపోతోంది. వ్యవసాయ సీజన్ జోరందుకున్న వేళ అన్నదాతల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఫర్టిలైజర్స్ దుకాణదారులు వారిని నిలువునా దోచుకుంటున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ప్రకారం యూరియా బస్తా ధర రూ. 267 మాత్రమే ఉండగా, స్థానిక వ్యాపారులు మాత్రం ఏకంగా రూ. 320 నుంచి రూ. 350 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక డీఏపీ అసలు ధర రూ. 1,350 కాగా, రైతుల వద్ద నుంచి ఏకంగా రూ. 1,500 నుండి రూ. 1,850 వరకు దండుకుంటున్నారు.
చివరకు ప్రభుత్వ యాప్ ద్వారా అధికారికంగా బుక్ చేసుకుని కొనుగోలు చేసినప్పటికీ వ్యాపారులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. కేవలం యూరియా, డీఏపీ మాత్రమే కాకుండా పంటలకు పిచికారీ చేసే పురుగు మందులు, స్ప్రే మందులను సైతం ఒక్కో దుకాణంలో ఒక్కో రేటుకు విక్రయిస్తూ ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు.
వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, తీవ్ర నిర్లక్ష్యం వల్లే వ్యాపారులు, దళారులు ఇంతలా బరితెగించారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మండలంలోని అన్ని దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, ప్రతి షాపు ఎదుట విధిగా ధరల పట్టిక ఏర్పాటు చేయించి, అధిక ధరలకు అమ్ముతున్న దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతాంగం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది.




