Mancherial: మంచిర్యాలలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. అటవీ ప్రాంతంలో శవం
Mancherial: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయికి చెందిన కుడుకల శ్రీనివాస్ జైపూర్ మండల అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో శవమై లభ్యమయ్యాడు.
Mancherial: మంచిర్యాలలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. అటవీ ప్రాంతంలో శవం
మంచిర్యాల జిల్లా: వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కుడుకల శ్రీనివాస్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. జైపూర్ మండలంలోని పౌనూరు, శివ్వారం గ్రామాల శివారులోని అటవీ ప్రాంతంలో శ్రీనివాస్ మృతదేహాన్ని గుర్తించారు.
ఈ నెల 20న తన స్నేహితుడిని కలిసేందుకు మంచిర్యాలకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాస్ తిరిగి రాలేదు.
దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనివాస్ కోసం గాలింపు చేపట్టారు.
అయితే తాజాగా అటవీ ప్రాంతంలో ఆయన మృతదేహం లభ్యమవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శ్రీనివాస్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని వారు ఆరోపిస్తున్నారు.
చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రీనివాస్ మృతికి గల కారణాలను పోలీసులు వెంటనే నిగ్గుతేల్చాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీనివాస్ మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, పోస్టుమార్టం నివేదిక మరియు దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా మృతికి గల కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.




