Mancherial: మంచిర్యాలలో ఘనంగా సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం!

Mancherial: మంచిర్యాల బెల్లంపల్లి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ప్రారంభించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 9 Oct 2026 8:22 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో ఘనంగా సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం!

Mancherial: ఎవరు దొంగిలించలేని సంపద విద్య మాత్రమేనని, విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్‌చార్జి విద్యాధికారి పి. చంద్రయ్య అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతితో కలిసి సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు ఆకలితో ఉంటే పాఠాలపై ఏకాగ్రత తగ్గుతుందని, అందుకే పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యతో ఏదైనా సాధించవచ్చని, విద్యను పంచిన కొద్దీ అది మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. బాలికలు రక్తహీనత బారిన పడకుండా అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో పోషక విలువలున్న ఆహారం అందిస్తూ, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవడంతో పాటు ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధించాలని సూచించారు. చదవడం, రాయడం, మాట్లాడటంలో నైపుణ్యం పెంపొందించుకోవాలని, క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రీడలు, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.