Mancherial: మందమర్రిలో క్వార్టర్ వివాదంపై స్పష్టతనిచ్చిన సింగరేణి యాజమాన్యం
Mancherial: మంచిర్యాల జిల్లా మందమర్రిలో మద్ది శంకర్ క్వార్టర్ ఖాళీ చేయించిన వ్యవహారంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధం లేదని సింగరేణి జీఎం స్పష్టంచేశారు.
Mancherial: మందమర్రిలో క్వార్టర్ వివాదంపై స్పష్టతనిచ్చిన సింగరేణి యాజమాన్యం
Mancherial: మంచిర్యాల జిల్లా మందమరి మద్ది శంకర్ క్వార్టర్ ఖాళీ చేయించిన వ్యవహారంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎలాంటి సంబంధం లేదని మందమర్రి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ స్పష్టం చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగానే సింగరేణి సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టామని తెలిపారు.
మందమర్రి ఏరియాలోని ఓ క్వార్టర్‌ను మద్ది శంకర్ అనధికారికంగా వినియోగిస్తున్నట్లు విజిలెన్స్‌కు ఫిర్యాదు అందిందని జీఎం తెలిపారు. దీనిపై సింగరేణి ఎస్టేట్, పర్సనల్ విభాగాల ద్వారా వివరాలు సేకరించి విచారణ చేపట్టగా, సదరు క్వార్టర్ మద్ది శంకర్‌కు అధికారికంగా కేటాయించలేదని తేలిందన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామికి ఇప్పటికే మరో క్వార్టర్‌ను క్యాంప్ కార్యాలయం కోసం కేటాయించినట్లు తెలిపారు. ఒకరికి క్వార్టర్ కేటాయించిన తర్వాత మరో క్వార్టర్ కేటాయించే నిబంధన సింగరేణిలో లేదన్నారు. బీ-40 క్వార్టర్‌కు గతంలో దరఖాస్తు చేసినప్పటికీ అది మంత్రికి లేదా వివేక్ వెంకటస్వామికి అధికారికంగా కేటాయించలేదని స్పష్టం చేశారు.
క్వార్టర్‌ను అనధికారికంగా వినియోగిస్తున్నట్లు విజిలెన్స్ నివేదిక అందిన తర్వాత నిబంధనల ప్రకారం ఖాళీ చేయించేందుకు చర్యలు ప్రారంభించామని జీఎం తెలిపారు. ముందుగా మద్ది శంకర్‌ను పిలిపించి క్వార్టర్ ఖాళీ చేయాలని సూచించామని, అనంతరం పర్సనల్ విభాగం ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించామని చెప్పారు. అయినప్పటికీ ఖాళీ చేయకపోవడంతో వరుసగా నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.
ఎవిక్షన్ ప్రక్రియలో భాగంగా ఫారమ్-ఏ, ఫారమ్-బీ నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలిపారు. అయినా క్వార్టర్ ఖాళీ చేయకపోవడంతో పోలీస్, సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్, ఎస్టేట్ విభాగాల సమక్షంలో సామగ్రిని సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు చెప్పారు. ఆ క్వార్టర్‌ను అనంతరం మరో సింగరేణి ఉద్యోగికి కేటాయించినట్లు వెల్లడించారు.
ఈ మొత్తం వ్యవహారం విజిలెన్స్ నివేదిక, కంపెనీ నిబంధనలు, నిర్దేశిత ఎవిక్షన్ ప్రక్రియ ప్రకారమే జరిగిందని జీఎం రాధాకృష్ణ స్పష్టం చేశారు. క్వార్టర్ ఖాళీ చేయింపు చర్యలకు మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కారణాలతో మంత్రిని ఈ వ్యవహారంలోకి తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు.




