Ichoda: కేసీఆర్‌కు మద్దతుగా ముఖరా (కె)లో దళిత దండు ర్యాలీ!
Ichoda: ఆదిలాబాద్ జిల్లా ముఖరా (కె)లో కేసీఆర్‌కు మద్దతుగా దళిత దండు ర్యాలీ. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దళితులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.
Ichoda: కేసీఆర్‌కు మద్దతుగా ముఖరా (కె)లో దళిత దండు ర్యాలీ!
Ichoda: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామంలో దళితులు పెద్ద ఎత్తున కదిలివచ్చారు. గ్రామంలో డప్పులు మోగిస్తూ, కేసీఆర్ చిత్రపటాలు చేతబూని దళిత దండు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేసి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం, దళితుల హక్కుల కోసం నిరంతరం పరితపించిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దళితులకు నిజమైన గౌరవం, స్థానిక సంస్థలతో పాటు ఉపాధి రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు దక్కాయని, అంతేకాకుండా జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసే గొప్ప అవకాశం లభించిందని గుర్తుచేశారు. భూమి లేని నిరుపేద దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి రైతులుగా నిలబెట్టారని, చారిత్రాత్మకమైన ‘దళిత బంధు’ పథకంతో ప్రతి కుటుంబానికి అండగా నిలిచి కేసీఆర్ నిజమైన ఆత్మబంధువుగా మారారని ప్రశంసించారు.
నేటి కాంగ్రెస్ పాలనపై దళిత సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి దళిత కుటుంబానికి ఇస్తామన్న 12 లక్షల రూపాయల సాయం కేవలం కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల వేళ ప్రకటించిన ‘దళిత డిక్లరేషన్’ హామీలు నేడు నీరుగారిపోయాయని, కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే దళితులను వాడుకోవడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని దళిత వర్గాలన్నీ కేసీఆర్‌కు కొండంత అండగా నిలుస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, దళిత నాయకులు విఠల్, తిరుపతి, దత్త, ప్రహ్లాద్, దిగంబర్, శంకర్‌లతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.




