Nirmal: గోదావరి పుష్కర పనులు వేగవంతంగా పూర్తి చేస్తాం కలెక్టర్ భవేశ్ మిశ్రా
Nirmal: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర అధికారులతో కలెక్టర్ భవేశ్ మిశ్రా వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. నిర్మల్ జిల్లాలో ఘాట్ల అభివృద్ధికి చర్యలు చేపట్టారు.
Nirmal: గోదావరి పుష్కర పనులు వేగవంతంగా పూర్తి చేస్తాం కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్: వచ్చే ఏడాది జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్ ల వద్ద భక్తుల సౌకర్యార్థం పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా సదుపాయాల కల్పన పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి హైదరాబాద్ నుండి శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత రావులు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా, పుష్కర ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ఆమోదం పొందిన పనులను త్వరగా ప్రారంభించాలని అన్నారు.
పనులన్నీ నాణ్యవంతంగా ఉండాలన్నారు. కలెక్టర్లు పుష్కరాల పనులన్నీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నివేదికలు సమర్పించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సందర్భంగా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, నిర్మల్ జిల్లాలోని బాసర పుష్కర క్షేత్రం వద్ద భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
దేవాదాయ, నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఆధ్వర్యంలో పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. వీటితో పాటు జిల్లాలోని గోదావరి పరీవాహక అన్ని పుష్కర ప్రదేశాల వద్ద పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు వీ.ఐ.పీలు, వీ.వీ.ఐ.పీలు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున వాహనాల పార్కింగ్, సరైన రోడ్డు వసతి, అత్యవసర ఎగ్జిట్ వంటి అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.




