Nirmal: బాసరలో గోదావరి పుష్కర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: కలెక్టర్!

Nirmal: బాసరలో రానున్న గోదావరి పుష్కర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని, సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

RAMESH RATNELLI, BASARA
Published on: 4 Nov 2026 11:53 PM IST
Nirmal
X

Nirmal: బాసరలో గోదావరి పుష్కర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: కలెక్టర్!

నిర్మల్: రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పుష్కరాల నాటికి అన్ని అభివృద్ధి, నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

బుధవారం బాసరలోని ఆలయ ఈవో కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లు, సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పుష్కర ఘాట్ల మరమ్మతులు, నూతన ఘాట్ల నిర్మాణం, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పిండ ప్రదాన ప్రాంతం, పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం, భక్తుల పార్కింగ్, వీఐపీ పార్కింగ్ తదితర పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, పుష్కరాలకు వచ్చే ప్రముఖుల వసతికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి పనికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

అనంతరం సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, పనుల్లో జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

పుష్కరాల ఏర్పాట్లు, ఆలయ నిర్మాణ పనులను సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ సుభాష్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA