Nirmal: ఆచరణాత్మక విద్యతోనే సృజనాత్మకత కేజీబీవీ తనిఖీలో కలెక్టర్ మిశ్రా

Nirmal: తానూరు కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా. పీఏసీఎల్ భూ బాధితుల సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం.

Srinivas, Mondol Bhainsa
Published on: 1 Sept 2026 5:52 PM IST
Nirmal
X

Nirmal: ఆచరణాత్మక విద్యతోనే సృజనాత్మకత కేజీబీవీ తనిఖీలో కలెక్టర్ మిశ్రా

Nirmal: పుస్తక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక విద్యను అందించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని జిల్లా కలెక్టర్‌ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం తానూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తరగతి గదులు, వసతిగృహం, పరిసరాలను పరిశీలించిన కలెక్టర్‌, పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా తీశారు. పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వంద శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఇప్పటివరకు పూర్తయిన సిలబస్‌, మిగిలిన పాఠ్యాంశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా సిలబస్‌ పూర్తి చేసి, పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే గుర్తించి పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.

పదో తరగతి విద్యార్థినులతో కలెక్టర్‌ ముఖాముఖిగా మాట్లాడారు. పాఠశాలలో అందుతున్న వసతులు, భోజనం నాణ్యత, చదువులో ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోర్డు మీద గణిత లెక్కలు రాయించి విద్యార్థినుల సామర్థ్యాన్ని పరిశీలించారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థినులను అభినందించి పెన్నులను బహుమతిగా అందించారు. పరీక్షల గురించి ఆందోళన చెందకుండా రోజువారీ చదువుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పాఠ్యాంశాల్లో సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి వెంటనే నివృత్తి చేసుకోవాలని, అర్థం చేసుకుని చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థినులకు సూచించారు.

అంతకుముందు తానూరు మండలం మొగిలి గ్రామంలోని విఠలేశ్వర ఆలయ ప్రాంగణంలో పీఏసీఎల్‌ (పెరల్స్‌ ఆగ్రోటెక్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) భూ బాధిత రైతులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ భూ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

బాధిత రైతుల నుంచి పూర్తి వివరాలను సేకరించి, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, జీపీవోల ద్వారా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే సంబంధిత భూములకు సమగ్ర సర్వే నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యలు ఉన్న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి బాధితుల నుంచి వివరాలు తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని కలెక్టర్‌ చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

మొగిలి గ్రామంలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి గ్రామస్థులు అందించిన వినతిని కలెక్టర్‌ స్వీకరించారు. సమస్యను పరిశీలించి త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విఠలేశ్వర ఆలయంలో కలెక్టర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్‌ మహేందర్‌నాథ్‌, ఎంపీడీవో శ్రీధర్‌, ఏఎంసీ ఛైర్మన్‌ షిండే ఆనంద్‌రావు పటేల్‌, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సర్పంచ్‌ ఉష, ఉపసర్పంచ్‌ నితిన్‌, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa

Next Story