Nirmal: ఉద్యానవన పంటల సాగుపై అవగాహన కల్పించాలి: కలెక్టర్!
Nirmal: ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా తక్కువ నీటితో పండే ఉద్యానవన పంటలు, సూక్ష్మ సేద్యంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
Nirmal: ఉద్యానవన పంటల సాగుపై అవగాహన కల్పించాలి: కలెక్టర్!
నిర్మల్: ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో వర్షపాతం తగ్గి నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగు చేసుకునే ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం సాగవుతున్న ఉద్యానవన పంటలు, వాటి విస్తీర్ణం, రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సూక్ష్మ సేద్య పద్ధతుల అమలుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు నీటి వినియోగాన్ని తగ్గించుకుంటూ వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలన్నారు. సంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, దీర్ఘకాలిక ఆదాయ అవకాశాలపై రైతులకు వివరించాలని సూచించారు. ముఖ్యంగా బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలని తెలిపారు.
తక్కువ నీటితో పంటలకు అవసరమైన తేమను అందించడం ద్వారా నీటిని పొదుపు చేయడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యానవన పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపే రైతులను గుర్తించి, వారికి అవసరమైన సాంకేతిక సలహాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బిందు సేద్య పరికరాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, గ్రామాల వారీగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రైతులు నీటి లభ్యత, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో మార్గదర్శనం చేయాలని స్పష్టం చేశారు.
రైతులు తక్కువ నీటితో స్థిరమైన ఆదాయం పొందేలా ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమణ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




