Nirmal: గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై కలెక్టర్ భవేష్ మిశ్రా సమీక్ష

Nirmal: నిర్మల్‌లో కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో బాసర ఆలయ అభివృద్ధి, గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 8 Sept 2026 8:34 PM IST
Nirmal
X

Nirmal: గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై కలెక్టర్ భవేష్ మిశ్రా సమీక్ష

నిర్మల్: నిర్మల్ కలెక్టర్ కార్యాలయ సమీకృత భవనంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆధ్వర్యంలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు వచ్చే సంవత్సరం నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ హాజరయ్యారు.

సమావేశంలో బాసర ఆలయానికి వచ్చే భక్తుల భద్రత, ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భక్తుల రాకపోకల నిర్వహణతో పాటు గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్‌లకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతిభద్రతలు, భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు.

పుష్కర ఘాట్‌ల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, వాచ్ టవర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ తదితర భద్రతా చర్యలను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని సమావేశంలో చర్చించారు.

భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు అవసరమైన ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ ప్రాంతాల గుర్తింపు, వాహనాల రాకపోకల నిర్వహణ, ఘాట్‌ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టేలా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని జిల్లా ఎస్పీ సూచించారు.

బాసర ఆలయ అభివృద్ధి పనులు మరియు గోదావరి పుష్కరాల ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని నిర్ణయించారు. పుష్కరాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టేలా సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నారు.

జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ మాట్లాడుతూ, బాసర ఆలయానికి వచ్చే భక్తులతో పాటు గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పుష్కరాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఐపిఎస్ నీటిపారుదల, ఆర్ అండ్ బి, ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ ఈఈలు అనిల్, సుభాష్, సందీప్, బాసర ఆలయ ఈఓ అంజనా దేవి, శంకరయ్య, ఇతర శాఖల అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story