Nirmal: గోదావరి పుష్కరాలకు పక్కా ఏర్పాట్లు చేయాలి

Nirmal: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సమీక్ష. భక్తుల భద్రత, పారిశుద్ధ్యం, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టికి ఆదేశం.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 5 Nov 2026 6:04 PM IST
Nirmal
X

Nirmal: గోదావరి పుష్కరాలకు పక్కా ఏర్పాట్లు చేయాలి

నిర్మల్: రానున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణకు ముందస్తు ప్రణాళికతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాసరతో పాటు జిల్లాలోని పుష్కర ప్రాంతాల్లో భక్తులు సౌకర్యవంతంగా పుణ్యస్నానాలు ఆచరించేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని, స్పష్టమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కర ఘాట్ల వద్ద నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడంతో పాటు, భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు అవసరమైన చోట్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో పాటు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి కూడా అవసరమైన వసతులు కల్పించాలని తెలిపారు.

భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పుష్కర ప్రాంతాల్లో అవసరమైన అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు, ఏఎస్పీ ఉపేంద్ర రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ ఈఈలు సందీప్, సుభాష్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL