Nirmal: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత.. కలెక్టర్ భవేశ్ మిశ్రా
Nirmal: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు.
Nirmal: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత.. కలెక్టర్ భవేశ్ మిశ్రా
Nirmal: పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా మామడ మండలం ఆరేపల్లి గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాలు, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులందరికీ పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి బాధ్యత అని తెలిపారు.
పర్యావరణ కాలుష్యం కారణంగా నేడు పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణ పరిస్థితుల్లో ప్రమాదకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. పుట్టినరోజు నాడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వివరించారు. రైతులు పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల కూడా పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని తెలిపారు. రైతులు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టవద్దని సూచించారు.
ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయ మార్గాలను పాటించాలని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది తమ తమ ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ప్రతి ఏడాది అడవులు దగ్ధమవుతున్నాయని,
దీని ద్వారా పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. అడవులు కాలిపోకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్, ఇతర అధికారులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, సీనియర్ సివిల్ జడ్జి రవీందర్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎఫ్డిఓ నాగిని బాను, ఇతర అధికారులు, గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




