Nirmal: ఎస్‌ఐఆర్‌పై దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం: ఏలేటి!
Nirmal: ఎస్‌ఐఆర్‌పై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నిర్మల్‌లో బీజేపీ 50 వేల మందితో మహా పాదయాత్ర తలపెట్టింది. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ హాజరుకానున్నారు.
Nirmal: ఎస్‌ఐఆర్‌పై దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం: ఏలేటి!
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రం మరో భారీ రాజకీయ కార్యక్రమానికి వేదిక కానుంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంతో పాటు, ఈ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా బీజేపీ మంగళవారం మహా పాదయాత్ర నిర్వహించనుంది. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
50 వేల మందితో జనసమీకరణ
నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి సుమారు 50 వేల మందికి పైగా కార్యకర్తలు, ప్రజలను సమీకరించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పవార్ రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్‌తో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సమాయత్తం చేశారు. సర్పంచులు, పార్టీ పదాధికారులు, కార్యకర్తల సమన్వయంతో పాదయాత్ర విజయవంతానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో బీజేపీ ఈ పాదయాత్రకు పిలుపునిచ్చింది. ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడం, ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రక్రియపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని పార్టీ నాయకులు చెబుతున్నారు.
హెలికాప్టర్‌లో సునీల్ బన్సల్ రాక
సునీల్ బన్సల్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిర్మల్‌కు రానున్నారు. ఇందుకోసం ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి వాహనంలో శాంతినగర్ చౌరస్తాకు చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి శివాజీ చౌక్ మీదుగా వివేక్ చౌక్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర సాగే మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. సునీల్ బన్సల్ తొలి నిర్మల్ పర్యటన నేపథ్యంలో స్వాగత ఏర్పాట్లను పార్టీ శ్రేణులు భారీగా చేపట్టాయి. నగరంలోని ప్రధాన కూడళ్లు కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలతో అలంకరించారు. ఈ పాదయాత్ర నేపథ్యంలో నిర్మల్‌లో రాజకీయ సందడి నెలకొంది.




