Nirmal: ప్రభుత్వ దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం: కలెక్టర్ భవేశ్ మిశ్రా!

Nirmal: నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టరేట్ సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 29 Oct 2026 7:44 PM IST
Nirmal
X

Nirmal: ప్రభుత్వ దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం: కలెక్టర్ భవేశ్ మిశ్రా!

నిర్మల్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచడంతో పాటు అగ్నిమాపక, నిఘా వ్యవస్థలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు.

గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టి, వైద్య పరికరాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది విధులకు సకాలంలో హాజరై సమయపాలన పాటించాలని, ఆసుపత్రుల్లో ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

జిల్లాలోని ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, రోగ నిర్ధారణ కేంద్రాలు నిబంధనలకు అనుగుణంగా పనిచేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో అధిక మొత్తాలు వసూలు చేసే కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం టీకాలు అందించాలని, ప్రజలకు జన ఔషధి మందులపై అవగాహన కల్పించాలని తెలిపారు. టీబీ వ్యాధి నిర్మూలనకు సమన్వయంతో కృషి చేయాలని, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మెరుగైన వైద్య సలహాలు, నిరంతర పర్యవేక్షణ ద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్యామ్‌సుందర్‌, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్‌ సింగ్‌, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ శారద, డీసీహెచ్‌ఎస్‌ కాశీనాథ్‌, వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL