Sarangapur: నిలిచిపోయిన రవాణా.. వరి కొనుగోళ్లపై రణం
Sarangapur: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి ఎక్స్ రోడ్డు వద్ద 44వ జాతీయ రహదారిపై రైతుల భారీ ధర్నా, రాస్తారోకో.
Sarangapur: నిలిచిపోయిన రవాణా.. వరి కొనుగోళ్లపై రణం
సారంగాపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి ఎక్స్ రోడ్డు 44వ జాతీయ రహదారిపై రైతులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. తాము పండించిన వరి ధాన్యం పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పంటకు సరిపడా గన్ని బ్యాగులను సరఫరా చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంటను అమ్మేందుకు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదన్నారు. మార్కెట్ యార్డులకు మార్కెట్ యార్డుల లారీలను పంపించి ధాన్యాన్ని తరలించాలన్నారు. లారీ అసోసియేషన్ నాయకులు ఒక్క క్వింటాలు ధాన్యానికి 10 కిలోలు కట్ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లారీ అసోసియేషన్ నాయకులు, అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని, లేనట్లయితే ఆత్మహత్యాయత్నానికి సైతం వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంటను వెంటనే కొనుగోలు చేసి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారి ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.




