Dasturabad: ఆకొండపేట గ్రామంలో ఘనంగా పొలాల అమావాస్య, ఎడ్ల పండుగ

Dasturabad: నిర్మల్ జిల్లా ఆకొండపేటలో ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు. మట్టితో ఎడ్ల ప్రతిమలను తయారు చేసి పూజలు నిర్వహించిన గ్రామస్తులు.

RAKESH N, KHANAPUR
Published on: 11 Sept 2026 7:51 PM IST
Dasturabad
X

Dasturabad: ఆకొండపేట గ్రామంలో ఘనంగా పొలాల అమావాస్య, ఎడ్ల పండుగ

దస్తూరాబాద్: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం ఆకొండపేట గ్రామంలో పొలాల అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఎడ్ల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం పొలాల అమావాస్యను పురస్కరించుకుని గ్రామ పెద్దలంతా స్థానిక చెరువు వద్దకు వెళ్లారు.

అక్కడ నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి, ఎడ్ల ప్రతిమలను రూపుదిద్దారు.ఈ మట్టి ప్రతిమలను గ్రామంలో ప్రతిష్టించి ఒకరోజు పాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఊరంతా ఒక్కటై, మంగళవాయిద్యాల నడుమ ఎడ్ల ప్రతిమలను గ్రామంలో ఘనంగా ఊరేగించారు.

గ్రామ పురవీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో అబాలగోపాలం ఉత్సాహంగా పాల్గొన్నారు.తర్వాత ఆ ప్రతిమలను గ్రామ చెరువు వద్దకు తీసుకువెళ్లి, అక్కడ అర్చకులు, పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆ పెద్ద ప్రతిమలను చెరువు నీటిలో భక్తిభావంతో నిమజ్జనం చేశారు.

ఈ విధంగా ప్రతి ఏటా పొలాల అమావాస్య రోజున మట్టితో ఎడ్ల ప్రతిమలను చేసి పూజించడం వల్ల.. తమ పశు సంపద ఆరోగ్యంగా ఉంటుందని, పంట పొలాలు పచ్చగా ఉండి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని నేతకాని కులస్తులు తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకల్లో ఆకొండపేట గ్రామానికి చెందిన నేతకాని కులస్థులతో పాటు, వివిధ కులాల పెద్దలు, గ్రామ ప్రజలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR