Nirmal: నిర్మల్‌లో ట్రాఫిక్ కట్టడికి ఎస్పీ జానకి షర్మిల కీలక ఆదేశాలు!
Nirmal: నిర్మల్ పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందం రంగంలోకి దిగింది.
Nirmal: నిర్మల్‌లో ట్రాఫిక్ కట్టడికి ఎస్పీ జానకి షర్మిల కీలక ఆదేశాలు!
Nirmal: నిర్మల్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టడం జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం పట్టణంలోని ప్రధాన కూడళ్లు, అధిక రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టనుంది.
ప్రత్యేకంగా నిర్మల్ బస్టాండ్ పరిసరాలు, ఆటో స్టాండ్, అంబేద్కర్ చౌక్, మయూరి హోటల్ సమీపం, కిసాన్ షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ఆక్రమణలు, రహదారులపై వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారులతో చర్చించి ట్రాఫిక్ సజావుగా సాగేలా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. అలాగే రహదారులపై అక్రమ పార్కింగ్‌ను నివారించి వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ కార్యక్రమం రేపటి నుంచి అమల్లోకి వస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని, వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపివేయాలని, రహదారులను ఆక్రమించకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు కృష్ణ, సమ్మయ్య, ఆర్‌ఐలు రామ్ నిరంజన్, రామక్రిష్ణ, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




