Nirmal: ఇందిరమ్మ బీమా నమోదు శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలి
Nirmal: నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఈ నెల 19న నిర్వహించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు శిబిరాలను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
Nirmal: ఇందిరమ్మ బీమా నమోదు శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్: జిల్లావ్యాప్తంగా ఈ నెల 19న నిర్వహించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు శిబిరాలను పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శిబిరాల ఏర్పాట్లు, నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకేరోజు నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పథకానికి సంబంధించిన పూర్తి అవగాహన క్షేత్రస్థాయి అధికారులకు ఉండాలని, కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ, వయస్సు, బంధుత్వ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని స్పష్టం చేశారు.
నమోదు ప్రక్రియతో పాటు డిజిటలైజేషన్‌లోనూ పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. శిబిరాల నిర్వహణకు అవసరమైన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు ముందుగానే సమకూర్చుకోవాలని తెలిపారు. ప్రతి శిబిరంలో టెంట్లు, కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల క్షేత్రస్థాయి అధికారులు శిబిరాలకు తప్పనిసరిగా హాజరై ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు బీమా భరోసా కల్పించే ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు, సీపీఓ గంగారెడ్డి, డీపీఓ శ్రీనివాస్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




