Gudihathnoor: పీహెచ్‌సీలో ఫ్యాన్ పడి శిశువుకు గాయం: అందని పరిహారం

Gudihathnoor: గుడిహత్నూర్ పీహెచ్‌సీలో ఫ్యాన్ ఊడిపడి గాయపడ్డ శిశువు తల్లికి టీజీహెచ్‌ఆర్‌సీ ఆదేశించిన రూ.50 వేల పరిహారం ఏడాది దాటినా అందకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది.

NAGULA SATISH, BOATH
Published on: 5 Nov 2026 8:05 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: పీహెచ్‌సీలో ఫ్యాన్ పడి శిశువుకు గాయం: అందని పరిహారం

గుడిహత్నూర్: ​ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పసికందుపై ఫ్యాన్ ఊడిపడిన దుర్ఘటన జరిగి సుమారు ఒకటిన్నర సంవత్సరం గడుస్తున్నా, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం మాత్రం ఇంకా కాగితాలకే పరిమితమైంది. స్వయంగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసి ఏడాది పూర్తయినా బాధిత తల్లికి ఇప్పటికీ పైసా సాయం అందకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది.

​గతేడాది జూన్ 22న గుడిహత్నూర్ మండలం కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్ జాధవ్ ప్రసవం కోసం గుడిహత్నూర్ పీహెచ్‌సీలో చేరగా, తల్లి-శిశువు ఉన్న మంచంపై ఉన్నట్టుండి సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఫ్యాన్ బోల్ట్ తుప్పుపట్టి తెగిపడటంతో పుట్టిన కొద్ది గంటలకే ఆ పసికందు తలకు తీవ్ర గాయమైంది. తల భాగంలో ఎముక విరగడం మెదడుపై రక్తపు గడ్డ ఏర్పడటంతో పసిగుడ్డు ప్రాణాపాయ స్థితికి చేరి ఆ కుటుంబం తీవ్ర మానసిక వేదనను అనుభవించింది.

​ఈ హృదయవిదారక ఘటనపై స్పందించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ TGHRC చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ సుమోటోగా కేసు (కేసు నం: HRC No. 2507/2025) నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రభుత్వ దవాఖానాల్లో రోగుల భద్రతను గాలికొదిలేయడం తీవ్ర తప్పిదమని మండిపడిన కమిషన్, 07.11.2025 తేదీన కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993, సెక్షన్ 18(e) ప్రకారం బాధిత బాలింత పాయల్ జాధవ్‌కు ప్రభుత్వం తక్షణమే రూ. 50,000/- నష్టపరిహారం చెల్లించాలని, రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

​అయితే కమిషన్ 07.11.2025న ఆదేశాలు ఇచ్చి ఏడాది దాటిపోతున్నా, ప్రభుత్వం చెల్లించాల్సిన ఆ రూ. 50 వేల నష్టపరిహారం నేటికీ బాధిత తల్లి చేతికి అందలేదు. నాటి ఘటనలో గాయపడిన చిన్నారి ఆరోగ్య పరిరక్షణకు, వైద్య ఖర్చుల కోసం ఆ పేద కుటుంబం ఇప్పటికీ అప్పుల పాలవుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో తక్షణమే జోక్యం చేసుకుని, కమిషన్ ఆదేశించిన రూ. 50 వేల పరిహారాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు, గ్రామస్తులు కోరుతున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH