Adilabad: మత్తు పదార్థాలపై అదిలాబాద్ ఎస్పీ కీలక సూచనలు!

Adilabad: ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న డి-అడిక్షన్ సెంటర్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. గంజాయి నిర్మూలనకు వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తామన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 7 July 2026 3:29 PM IST
Adilabad
X

Adilabad: మత్తు పదార్థాలపై అదిలాబాద్ ఎస్పీ కీలక సూచనలు!

ఆదిలాబాద్: గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలతో పాటు వ్యసనగ్రస్తులకు వైద్య చికిత్స అందించి వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని అదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

మంగళవారం ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న డి-అడిక్షన్ సెంటర్ ను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని వైద్య సదుపాయాలు, చికిత్సా విధానాలు, వ్యసనగ్రస్తులకు అందించనున్న కౌన్సెలింగ్, పునరావాస సేవలపై వైద్య బృందంతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి సరఫరా, విక్రయం, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు గంజాయికి బానిసైన వారిని గుర్తించి వారికి శాస్త్రీయ పద్ధతిలో వైద్య చికిత్స, మానసిక కౌన్సెలింగ్ అందించడం ద్వారా శాశ్వతంగా వ్యసనం నుంచి బయటపడేలా చేయడం అత్యంత అవసరమని అన్నారు. శిక్షతో పాటు సంస్కరణ కూడా సమాజానికి అవసరమని, అందుకే జిల్లా పోలీస్ శాఖ వైద్య శాఖతో సమన్వయం చేసుకొని డి-అడిక్షన్ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తోందన్నారు.

జిల్లా వ్యాప్తంగా గంజాయి సేవించే వ్యక్తులను గుర్తించి, మత్తు పదార్థాలకు బానిస అయిన వారిని గుర్తించి, వారి కుటుంబ సభ్యుల సహకారంతో స్వచ్ఛందంగా డి-అడిక్షన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. చికిత్స అనంతరం మళ్లీ మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా నిరంతర కౌన్సెలింగ్, పర్యవేక్షణ కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా వైద్య అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story