Nirmal: నిర్మల్ కలెక్టరేట్‌లో అధికారికంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు!

Nirmal: నిర్మల్ కలెక్టరేట్‌లో ఘనంగా పండుగ సాయన్న జయంతి. నివాళులర్పించిన ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై హర్షం.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 22 Oct 2026 12:49 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ కలెక్టరేట్‌లో అధికారికంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు!

Nirmal: నిర్మల్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గురువారం బహుజన సంక్షేమ పోరాట వీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో జిల్లా ఇన్ ఛార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ పాల్గొన్నారు. ముందుగా అధికారులు, ముదిరాజ్ సంఘ నాయకులతో కలిసి పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బహుజనుల అణిచివేతపై ఆనాటి కాలంలో దొరలు, భూస్వాములు, నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పండుగ సాయన్న గొప్ప పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయనను మనమంతా స్పూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తొలిసారిగా పండుగ సాయన్న జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఇలాంటి మహనీయుల జీవిత విశేషాలు నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని తెలిపారు.

పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ, నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లలో, ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న అని కొనియాడారు. తెలంగాణ రాబిన్ హుడ్ గా సుపరిచితుడైన సాయన్న ప్రజలను దోచుకుంటున్న దొరలు, దేశముఖ్‌లు, అధికారులు, సంపన్నుల ఆస్తులను తీసుకొని పేదలకు పంచిపెట్టాడని తెలిపారు. నాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించి, వారిని ఎదిరించి బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించాడని వివరించారు.

పండుగ సాయన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ జయంతి వేడుకలలో బిసి సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్, ఉపాధి కల్పన శాఖ అధికారి విజయలక్ష్మి, కార్మిక శాఖ అధికారి రాజలింగం, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ముదిరాజ్ కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL