Kotapalli: కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం 25 బైక్‌లు సీజ్ ఐదుగురిపై కేసులు

Kotapalli: కోటపల్లి మండలం సర్వాయిపేటలో పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించాయి.

RAJENDER, CHENNUR
Published on: 27 May 2026 11:24 AM IST
Kotapalli
X

Kotapalli: కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం 25 బైక్‌లు సీజ్ ఐదుగురిపై కేసులు

కోటపల్లి: పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వాయిపేట గ్రామంలో విస్తృత స్థాయిలో ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేస్తూ నివాసితుల వివరాలను సేకరించారు.

గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా ప్రవేశించారా, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తలదాచుకుంటున్నారా అనే కోణంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు, సరైన ధ్రువపత్రాలు లేని సుమారు 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచడం, గ్రామాల్లో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశమని చెన్నూర్ రూరల్ సీఐ ఆర్ కృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం వంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పేర్కొన్న ఆయన, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా ‘డయల్ 100’కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అనంతరం చెన్నూర్ ఎక్సైజ్ సీఐ హరి ఆధ్వర్యంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, స్థానిక పోలీసులతో కలిసి గ్రామంలోని గుడుంబా ప్రభావిత ప్రాంతాలపై సంయుక్త మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 2000 లీటర్ల బెల్లపు పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేయగా, 20 లీటర్ల నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీ, అక్రమ రవాణా మరియు విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు చెన్నూర్ ఎక్సైజ్ సీఐ హరి తెలిపారు.

ప్రభుత్వం నిషేధించిన గుడుంబా తయారీ, విక్రయాలు, అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఎక్సైజ్ సీఐ హరి, ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ సమ్మయ్య, కోటపల్లి ఎస్సై రాజశేఖర్, నీల్వాయి ఎస్సై జగదీష్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై బి. రమణ, చెన్నూర్ రూరల్ సర్కిల్ సిబ్బంది మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story