Basar: జాతీయ స్థాయిలో సత్తా చాటిన బాసర ఆర్జీయూకేటీ ‘టీమ్ వేగా’!

Basar: కోయంబత్తూరులో జరిగిన జాతీయ ఎలక్ట్రిక్ రేసింగ్ బైక్ పోటీలో బాసర ఆర్జీయూకేటీ ‘టీమ్ వేగా’ ఆల్ ఇండియా 7వ ర్యాంకు సాధించగా వీసీ ప్రొ. గోవర్ధన్ అభినందించారు.

RAMESH RATNELLI, BASARA
Published on: 23 Nov 2026 8:04 PM IST
Basar
X

Basar: జాతీయ స్థాయిలో సత్తా చాటిన బాసర ఆర్జీయూకేటీ ‘టీమ్ వేగా’!

బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), బాసర్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచారు. విశ్వవిద్యాలయానికి చెందిన ‘టీమ్ వేగా’ (Team Vega) విద్యార్థులు 'ఫ్రెటర్నిటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్' (FMAE) నిర్వహించిన జాతీయ స్థాయి ఎలక్ట్రిక్ రేసింగ్ పోటీలో ఆల్ ఇండియా 7వ ర్యాంకు (AIR 7) సాధించి విశ్వవిద్యాలయానికి గర్వకారణంగా నిలిచారు.

తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీలో దేశవ్యాప్తంగా పలు ప్రముఖ విద్యాసంస్థల బృందాలు పాల్గొన్నాయి. ఈ పోటీలో ఆర్జీయూకేటీ బాసర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE) విద్యార్థులతో కూడిన టీమ్ వేగా, స్వయంగా డిజైన్ చేసి తయారు చేసిన ఎలక్ట్రిక్ రేసింగ్ మోటార్‌సైకిల్‌తో బరిలోకి దిగి తమ సాంకేతిక నైపుణ్యం, ఆవిష్కరణ సామర్థ్యంతో 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

*సవాళ్లను అధిగమించి వాహన నిర్మాణం*

ఈ రేసింగ్ బైక్ తయారీలో మోటార్ ఎంపిక, బ్యాటరీ ప్యాక్ నిర్మాణం, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోలర్ ఇంటిగ్రేషన్, వైరింగ్, ఛాసిస్ డిజైన్, వాహన నిర్మాణం వంటి కీలక అంశాలన్నింటినీ విద్యార్థులే స్వయంగా చేపట్టారు. పరిమిత బడ్జెట్, ఆర్థిక ఇబ్బందులు, విడిభాగాల సమీకరణ, తయారీ సవాళ్లు ఎదురైనా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పట్టుదలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతీయ వేదికపై సత్తా చాటారు.

*విద్యార్థులను ప్రత్యేకంగా ప్రోత్సహించిన ఉపకులపతి ప్రొ. ఏ. గోవర్ధన్*

జాతీయ స్థాయిలో విజయం సాధించిన టీమ్ వేగా విద్యార్థులను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. ఏ. గోవర్ధన్ ప్రత్యేకంగా అభినందించి, వారిలో మరింత స్ఫూర్తి నింపేలా ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. "గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మన విద్యార్థులు పరిమిత వనరులతోనే తమ వినూత్న ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చి, జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు సాధించడం ఎంతో గర్వకారణం. తరగతి గది పాఠాలకే పరిమితం కాకుండా ఇలాంటి ప్రాక్టికల్ ఆవిష్కరణలు చేపట్టడం ద్వారానే విద్యార్థులు నిజమైన ఇంజినీర్లుగా ఎదుగుతారు. ఈ విజయం మిగతా విద్యార్థులకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకం.

భవిష్యత్తులో మీరు మరిన్ని నూతన ప్రయోగాలు చేయాలని, అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ విజేతలుగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. ఎలక్ట్రిక్ వాహన పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల దిశగా అడుగులు వేసే విద్యార్థులకు విశ్వవిద్యాలయ యాజమాన్యం తరఫున ఎల్లప్పుడూ పూర్తి సహాయ సహకారాలు, ప్రోత్సాహం అందిస్తాం" అని భరోసా ఇచ్చారు.

అలాగే, విద్యార్థులకు నిరంతరం సూచనలు, సలహాలు అందిస్తూ వెన్నుదన్నుగా నిలిచిన ఈఈఈ (EEE) విభాగాధిపతి డా. భావ్ సింగ్, అధ్యాపకులు డా. ఎన్. రాకేశ్, వి. వినయ్ కుమార్‌లను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

*భవిష్యత్ లక్ష్యం – కృతజ్ఞతలు*

ఈ పోటీ ద్వారా ప్రాక్టికల్ ఇంజినీరింగ్, టీమ్‌వర్క్, సమస్య పరిష్కారం, ఎలక్ట్రిక్ వాహన సాంకేతికత, మోటార్‌స్పోర్ట్స్ రంగాల్లో విలువైన అనుభవాన్ని పొందామని విద్యార్థులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆర్జీయూకేటీ బాసర్‌లో ఎలక్ట్రిక్ వాహన పరిశోధన, మోటార్‌స్పోర్ట్స్, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధికి బలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని తెలిపారు. తమ విజయానికి తోడ్పడిన ఉపకులపతి ప్రొ. ఏ. గోవర్ధన్, ఓఎస్డీ ప్రొ. మురళీ దర్శన్, విశ్వవిద్యాలయ యాజమాన్యం, అధ్యాపకులు, ఫ్యాకల్టీ అడ్వైజర్లు, స్పాన్సర్లకు టీమ్ వేగా విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA