Mancherial: వయోవృద్ధులు మన జీవితాలకు మూలస్తంభాలు: వెంకటయ్య
Mancherial: మంచిర్యాలలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. వృద్ధులు మన కుటుంబాలకు మూలస్తంభాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పేర్కొంది.
Mancherial: వయోవృద్ధులు మన జీవితాలకు మూలస్తంభాలు: వెంకటయ్య
మంచిర్యాల: వయో వృద్ధులు మన కుటుంబాలకు, సమాజానికి మార్గదర్శకులని, వారి అనుభవం, జ్ఞానం భావితరాలకు ఎంతో విలువైనదని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురు వయో వృద్ధులను పూల బొకేలు అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. వారికి అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. వృద్ధులు మన జీవితాలకు మూలస్తంభాలు, కుటుంబాలకు జీవన వృక్షాలు, మన సంస్కృతికి నిలువెత్తు ప్రతిరూపాలని పేర్కొన్నారు. వృద్ధాప్యం అనేది జీవితానుభవం, త్యాగం, జ్ఞానం, జ్ఞాపకాలతో నిండిన అందమైన దశ అని అన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల చిన్నతనంలో ఎన్నో త్యాగాలు చేసి, వారి భవిష్యత్తు కోసం తమ సుఖాలను సైతం పక్కన పెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల నుంచి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతను కోరుకుంటున్నారని తెలిపారు.
ఖరీదైన బహుమతుల కంటే తల్లిదండ్రులతో కొంత సమయం ప్రేమగా మాట్లాడటం, ఓపికగా వారి మాటలు వినడం, ఆప్యాయంగా పలకరించడం ఎంతో విలువైనదని వెంకటయ్య అన్నారు. వృద్ధ తల్లిదండ్రులను ఆదరించాలని, అనాథాశ్రమాలకు పంపకుండా కుటుంబ సభ్యులుగా ప్రేమగా చూసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా “తల్లిదండ్రులను ఆదరించండి.. ఆప్యాయంగా పలకరించండి.. అనాథాశ్రమాలలో చేర్పించకండి.. వయో వృద్ధుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేశారు.
కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షుడు ఏ. గంగయ్య, నాయకులు ఏ. అంజన్న, రాజా గౌడ్, పోతురాజుల చంద్రయ్య, ఏ. రాజేశం, జి. లక్ష్మణ్, జి. నారాయణ, బి. జ్ఞాని తదితరులు పాల్గొన్నారు.




