Gudihathnoor: డాక్టర్ టేబుల్‌పైకే వచ్చిన పాము: గుడిహత్నూర్‌లో ఘటన!
Gudihathnoor: గుడిహత్నూర్ పశువైద్యశాలలో పిచ్చిమొక్కలు పెరిగి పాములు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏకంగా డాక్టర్ టేబుల్‌పైకి పాము రావడంతో సిబ్బంది భయాందోళన చెందుతున్నారు.
Gudihathnoor: డాక్టర్ టేబుల్‌పైకే వచ్చిన పాము: గుడిహత్నూర్‌లో ఘటన!
గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని పశువైద్యశాల (వెటర్నరీ హాస్పిటల్) ప్రాంగణం తీవ్ర నిర్లక్ష్యానికి కేరాఫ్‌గా మారింది. ఆసుపత్రి చుట్టూ భారీగా పిచ్చిమొక్కలు, ఎత్తైన గడ్డి పెరిగిపోవడంతో ఆ ప్రాంతం విషజీవులకు అడ్డాగా మారింది. పరిసరాలు అడవిని తలపిస్తుండటంతో హాస్పిటల్ పరిధిలో పాములు స్వేచ్ఛగా సంచరిస్తూ బుసలు కొడుతున్నాయి. దీంతో పశువులకు చికిత్స కోసం వచ్చే రైతులు, నిత్యం విధుల్లో ఉండే సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన దుస్థితి నెలకొంది.
ఈ విషయమై హెచ్‌ఎంటీవీ (hmtv) ప్రతినిధి వెటర్నరీ డాక్టర్ శ్రీకాంత్‌ను సంప్రదించగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగైదు రోజుల క్రితం ఆసుపత్రి గదిలోకి ప్రవేశించిన ఒక పెద్ద పాము ఏకంగా తన టేబుల్‌పైకే వచ్చి కూర్చుందని, అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పిందని భయాందోళన వ్యక్తం చేశారు. ప్రాంగణాన్ని శుభ్రం చేయించాలని, పిచ్చిమొక్కలను తొలగించాలని గ్రామ పంచాయతీ సెక్రటరీకి పలుమార్లు విన్నవించినా కనీసం పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు.
మరోవైపు ఆసుపత్రి చుట్టుపక్కల నివాసముంటున్న కాలనీవాసులు సైతం పంచాయతీ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని మండిపడుతున్నారు. సమస్య తీవ్రత తెలిసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు గానీ, పశువైద్య సిబ్బందికి గానీ ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత పంచాయతీ అధికారులదేనని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, హాస్పిటల్ పరిసరాల్లో పెరిగిన కంపచెట్లను, పిచ్చిమొక్కలను తొలగించి ప్రాంగణాన్ని శుభ్రం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.




