Ichoda: ఇచ్చోడ గుండాలలో పోలీసుల మెరుపు తనిఖీలు.. 71 వాహనాలు సీజ్!
Ichoda: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల గుండాల గ్రామంలో ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో 100 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
Ichoda: ఇచ్చోడ గుండాలలో పోలీసుల మెరుపు తనిఖీలు.. 71 వాహనాలు సీజ్!
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో 100 మంది పోలీసు సిబ్బందితో ఉదయం 5 నుండి 8 గంటల వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. ప్రజల రక్షణ, భద్రతే ధ్యేయంగా చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా కలప విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిపై కేసు నమోదు చేసి, వారి నుండి రూ. 15 వేల విలువైన కలపతో పాటు కటింగ్ యంత్రాన్ని సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలంతా గంజాయి, మాదకద్రవ్యాలు, దొంగతనాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో మెదలాలని సూచించారు. గొడవలకు దిగేవారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని, పాత నేరస్థులు ప్రవర్తన మార్చుకోకపోతే సస్పెక్ట్ షీట్లతో పాటు పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో నేరాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు వైపు ప్రోత్సహించాలని, అలాగే వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పి రుత్వీక్ సాయి కొట్టే, ఎస్బీ డిఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు మరియు ప్రత్యేక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




