Nirmal: నిర్మల్‌లో ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష!

Nirmal: నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం. పండుగ భద్రత, కేసుల దర్యాప్తుపై అధికారులకు ఆదేశాలు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 10 Oct 2026 10:59 AM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష!

Nirmal: నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం, CCTNS నిర్వహణ, ఈ-సాక్ష్య, ఆన్‌సైట్, జీరో ఎఫ్‌ఐఆర్ విధానాల అమలు, మహిళలు, బాలల భద్రత, రాబోయే పండుగల భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, పటిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించి నేరస్తులకు శిక్ష పడేలా, బాధితులకు సత్వర న్యాయం అందేలా పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు. దీర్ఘకాలిక పెండింగ్ కేసులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని, CCTNS 2.0లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.

దర్యాప్తులో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఈ-సాక్ష్య ద్వారా సాక్ష్యాధారాల సేకరణ, భద్రపరచడంలో నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. ఆన్‌సైట్ విధానంలో అవసరమైన వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేయాలని, జీరో ఎఫ్‌ఐఆర్ విధానంపై అవగాహనతో వ్యవహరిస్తూ బాధితులకు తక్షణ న్యాయం అందేలా చూడాలని ఆదేశించారు.

దసరా, బతుకమ్మ పండుగలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకునేలా ముందస్తు భద్రతా ప్రణాళిక రూపొందించాలని, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. మహిళలు, బాలల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

గంజాయి అక్రమ రవాణా, ఆస్తి నేరాల నియంత్రణకు నిఘా పెంచాలని, బీట్ వ్యవస్థను బలోపేతం చేసి రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించేలా ప్రచారం చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించారు.

నేర సమీక్షా సమావేశం అనంతరం జిల్లా ఎస్పీ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల కండిషన్, నిర్వహణ, అందుబాటులో ఉన్న పరికరాలను పరిశీలించి, వాహనాలను ఎల్లప్పుడూ విధులకు సిద్ధంగా ఉంచాలని, అవసరమైన మరమ్మతులు సకాలంలో చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యాలని ఎస్పీ పేర్కొంటూ, అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.

ఈ సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, IPS, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, సమ్మయ్య, సత్యనారాయణ, ప్రవీణ్, సాయి కుమార్, రవీందర్ నాయక్, దీపక్, మల్లేష్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, డీసీఆర్‌బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL