Nirmal: గణేష్ ఉత్సవాల్లో సైబర్ మోసాలపై ఎస్పీ జానకి షర్మిల హెచ్చరిక!

Nirmal: రాబోయే వినాయక చవితి వేళ సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సూచించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 2 Sept 2026 5:49 PM IST
Nirmal
X

Nirmal: గణేష్ ఉత్సవాల్లో సైబర్ మోసాలపై ఎస్పీ జానకి షర్మిల హెచ్చరిక!

నిర్మల్: రాబోయే గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎలాంటి సైబర్ మోసాలకు గురికాకుండా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన BE CYBER WISE – Lord Ganesha Teaches Us అవగాహన పోస్టర్‌ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ ఆవిష్కరించారు.

గణేష్ ఉత్సవాల సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరే అవకాశం ఉన్నందున, అదే సమయంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. OTPలు, ATM/బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని, గుర్తుతెలియని లింకులు, అనుమానాస్పద యాప్‌లు, నకిలీ వెబ్‌సైట్లను ఉపయోగించవద్దని తెలిపారు.

సైబర్ నేరాల నివారణలో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండపాల వద్ద, కళాశాలలు, విద్యాసంస్థల్లో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలు, యువతకు సైబర్ నేరాలపై జాగ్రత్తలు, ఆన్‌లైన్ మోసాల నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే విరాళాల అభ్యర్థనలు, నకిలీ QR కోడ్‌లు, ఫేక్ అకౌంట్లు, అనుమానాస్పద లింకులు, ఆన్‌లైన్ ఆఫర్లు వంటి వాటి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని, అలాగే National Cybercrime Reporting Portal ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలనిఎస్పీ తెలిపారు. “అప్రమత్తతే సైబర్ నేరాల నుంచి రక్షణ – ఆలోచించి క్లిక్ చేయండి, సురక్షితంగా ఉండండి” అనే సందేశాన్ని గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ ముత్యం, ఎస్‌ఐ శ్రావణి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL