Asifabad: రూ.23 లక్షల మొబైళ్లను అప్పగించిన ఎస్పీ నితికా పంత్!
Asifabad: పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మొబైల్ రికవరీ మేళా నిర్వహించి, రూ.23.40 లక్షల విలువైన 117 ఫోన్లను బాధితులకు అందజేశారు.
Asifabad: రూ.23 లక్షల మొబైళ్లను అప్పగించిన ఎస్పీ నితికా పంత్!
ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మొబైల్ రికవరీ మేళాలో రూ. 23,40,000 విలువైన 117 ఫోన్లను ఎస్పీ నితికా పంత్ చేతుల మీదుగా బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ప్రస్తుత రోజుల్లో మొబైల్ లేనిదే ఏ చిన్న లావాదేవీ కూడా చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.
బ్యాంక్ అకౌంట్లు, పాస్‌వర్డ్‌లతో పాటు విలువైన సమాచారాన్ని ఫోన్లలో భద్రపరుచుకుంటున్నారని గ్రహించే నేరగాళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీక్ పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేసి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులు కాజేస్తున్నారని వివరించారు. దీనివల్ల బాధితులు వ్యక్తిగత సమాచారంతో పాటు ఆర్థికంగానూ నష్టపోతున్నారన్నారు.
మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు వెంటనే https://www.ceir.gov.in 'సీఈఐఆర్' (CEIR) పోర్టల్‌లో బ్లాక్ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే సెకండ్ హ్యాండ్ మొబైళ్లు కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా షాపు యజమాని నుంచి రసీదు తీసుకోవాలని స్పష్టం చేశారు. దొంగిలించిన ఫోన్లని తెలిసి కూడా కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రవీందర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




